Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- భారత జాతీయ మహిళా సమాఖ్య, రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
బిల్కిస్ బానోకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హిమాయత్‌నగర్, లిబర్టీ బస్టాప్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య, రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈకార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడుతూ నారీశక్తి, బేటీ బచావో వంటి బూటకపు నినాదాలు ఇచ్చే వారే లైంగికదాడి నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు. బిల్కిస్‌బానో కేసును సీబీఐ విచారించి, కేసు నమోదు చేసిందని, కోర్టులు శిక్ష విధించాయని గుర్తుచేశారు. కానీ కేంద్రం సమ్మతి లేకుండా గుజరాత్ రాష్ట్రం జీవితకాలం శిక్ష అనుభవిస్తున్న 11 మంది నిందితులను ఎలా విడుదల చేస్తుందని ప్రశ్నించారు. సంఫ్‌ు పరివార్ శక్తులు అక్రమంగా విడుదలైన లైంగికదాడి నిందితులను యుద్ధ వీరులుగా స్వాగతించడం సిగ్గుచేటు అని అన్నారు. న్యాయం పట్ల మహిళల విశ్వాసాన్ని పునరుద్దరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని, మహిళలు భయం లేకుండా శాంతితో జీవించే హక్కు కాలరాస్తోందని అన్నారు. బిల్కిస్‌బానో కేసులో 11 మంది దోషులకు శిక్షల ఉపశమనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. మిగిలిన జీవితకాల శిక్షను అనుభవించడానికి వారిని తిరిగి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఉస్తెల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి, సహాయ కార్యదర్శి నళిని, ఉపాధ్యక్షులు ఎస్.ఛాయాదేవి, జంగమ్మ, కార్యదర్శి జె.లక్ష్మి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని, నాయకులు గిరిజ, మాధవి జ్యోతి, అండాలు తదితరులు పాల్గొన్నారు.