Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- ఆడి పాడిన మేయర్, డిప్యూటీ మేయర్
- వేడుకల్లో పాల్గొన్న మహిళా ఉన్నతాధికారులు, సిబ్బంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. అందమైన పూలతో అలంకరించిన బతుకమ్మలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు యూసీడీ విభాగం అదనపు కమిషనర్ శతి ఓజా, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్లు మమత, పంకజ, గాజుల రామారం డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, మహిళా అధికారులు, సిబ్బందితో కలిసి ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆటపాటలతో జీహెచ్ఎంసీ కార్యాలయంలో సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అన్ని మతాల పండుగలను సమానంగా ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 6 లక్షలకుపైగా చీరలు పంపిణీ చేశామని తెలిపారు. ఈనెల 30వ తేదీన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. వీరితో పాటు ఇంకా రాష్ట్ర మహిళా మంత్రులు, పోలీసు అధికారులు, మహిళా చైర్మెన్, జీహెచ్ఎంసీ పరిధిలోని మహిళా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. ఆసక్తి గల వారందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ కోరారు. అక్టోబర్ 3వ తేదీ సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మల ఊరేగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు మేయర్ తెలిపారు. నగరవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మేయర్ కోరారు. బతుకమ్మ నిమజ్జనం కోసం బేబీ పాండ్స్, ఆర్టిఫిషియల్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.