Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి.. ఇద్దరు గల్లంతు
- కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- టీకేఆర్ కాలేజీ విద్యార్థులుగా గుర్తింపు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
స్నేహితుల జన్మదిన వేడుకలకు వచ్చి సరదాగా చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చోటు చేసు కుంది. ఎల్బీనగర్ సమీపంలోని మీర్పేట తీగల కృష్ణారెడ్డి కళాశాలకు చెందిన బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తొమ్మిది మంది తమ స్నేహితులు ఉబేద్ (18), హరిహరన్ (18) పుట్టినరోజు సందర్భంగా శివారులోని చీర్యాల లక్ష్మీ నర్సింహ్మ స్వామి ఆలయానికి వచ్చారు. స్వామి దర్శనం అనంతరం విద్యా ర్థులు నాట్ కన్ చెరువులోకి సరదాగా ఈత కొట్టేందుకు మొదట హరిహరన్, బాలాజీ దిగారు. కొద్ది దూరం వెళ్ళాక వీరి వెనకాల ఉబేదు సైతం ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోనే ముగ్గురూ నీట మునిగిపోయారు. చెరువు గట్టు మీద ఉన్న మిగిలిన స్నేహితులు ముగ్గురు నీటిలో మునగడాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. స్థానికులు కీసర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కీసర సీఐ రఘువీర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లను పిలిపించారు. బాలాజీ అనే విద్యార్థి డెడ్ బాడీని చెరువు నుంచి బయటకు తీయగా.. మిగతా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల కోసం స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. మిగతా ఆరుగురు విద్యార్థులను కీసర పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. ప్రమాదానికి కారణం సరియైన ప్రమాద సూచిక బోర్డులు చెరువు వద్ద ఏర్పాటు చేయక పోవడం, రక్షణ ఏర్పాట్లు లేకపోవడమే అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.