Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ ఆధ్వర్యంలో జాషువా జయంతి వేడుకలు
నవతెలంగాణ-దుండిగల్
తన పదునైన కవిత్వంతో సమాజాన్ని మేల్కొల్పిన మహాకవి గుర్రం జాషువా అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) నాయకులు అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతి నగర్లో బుధవారం ప్రముఖ కవి గుర్రం జాషువా 127వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢ ఆచారాలపై తిరగబడ్డ కవి సామ్రాట్ జాషువా అని కొనియాడారు. చీత్కారాలు ఎదురైన చోటనే సత్కారాలు పొంది, ఆధునిక కవి కోకిలగా పేరొందారని గుర్తు చేశారు. ఎన్నో అవమానాలని ఎదుర్కొన్న గుర్రం జాషువా, తన పదునైన కలం ద్వారా సమాజాన్ని మేల్కొల్పే విధంగా కవిత్వాలు రాశారని, ఇందుకుగాను గజారోహణ, కనకాభిషేకాలు పొందారని తెలిపారు. ఎన్నో రకాల బిరుదులతో పాటు, ప్రభుత్వం అత్యున్నత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కళా ప్రపూర్ణ, పద్మభూషణ్ వంటి పురస్కారాలు జాషువాకు దక్కాయన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున్, పి. స్వామి, గోపాల్, నరసింహ, వెంకట రాములు, శేఖర్, రాజు ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.