Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రోజులుగా కొనసాగుతున్న సమస్య, ఇబ్బంది పడుతున్న జనం
- గంటల తరబడి ప్రయత్నించినా స్లాట్స్ బుక్కవ్వని వైనం
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
- గ్రేటర్‌తోపాటు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి
- సర్వర్ కేబుల్ డ్యామేజీతోనే సేవలకు అంతరాయం!
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖను సర్వర్ కష్టాలు వెంటాడు తున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఆర్టీఏ వెబ్సైట్ సరిగా పనిచేయక పోవడంతో వాహన దారులు స్లాట్స్ బుక్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొ స్లాట్‌కు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలోనూ పలు సందర్భాల్లో సాంకేతిక కారణాలతో రాష్ట్రమంతటా రవాణాశాఖ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కురిసిన వర్షాలతో సర్వర్ కేబుల్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆర్టీఏ పౌర సేవలకు అంతరాయం కలిగిందని రవాణాశాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎక్కడా లావాదేవీల రద్దు వంటివి జరగలేదని వెల్లడించాయి. కానీ ఈ సాంకేతిక సమస్య కారణంగా సోమవారం రోజు స్లాట్స్ బుక్కాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో మంగళవారం చాలాతక్కువ మంది స్లాట్స్ బుక్ చేసుకోగలిగారు. ఇక బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 11గంటల మధ్యలో సర్వర్ చాలా స్లోగా పనిచేసిందని.. ఆ తర్వాతే స్లాట్స్ బుక్ కావడం జరిగిందని మేడ్చల్‌కు చెందిన ఓ వాహనదారుడు తెలిపారు. అసలే దసరా సీజన్ కావడంతో ఈ మూడు రోజులుగా వాహన రిజిస్ట్రేషన్, ఇతర ఆర్టీఏ పనులు చేసుకుందామనుకున్నవారికి ఈ సాంకేతిక సమస్య కాస్త నిరాశే మిగిల్చింది. ఈ నేపథ్యంలో చాలావరకు వినియోగదారులు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసెన్స్లకు దూరంగా ఉండిపోగా.. మిగతా 59 రకాల సేవలపై ఆ ప్రభావం కనిపించింది. కాగా రెండు రోజులుగా సర్వర్ ప్రాబ్లమ్‌తో బుధవారం పనులు పూర్తి చేసుకుందామని భావించిన వారికి గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు. ఇందులో మహిళలు, కాలేజీ విద్యార్ధులు, ఆఫీసులు, కంపెనీలకు వెళ్లేవారు కూడా ఉన్నారు. పండుగ సీజన్ కావడంతో చాలామంది నూతన వాహనాలు కొనుగోలు చేసి.. మంచి రోజు చూసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుందామనుకునే వారికి ఇప్పుడు ఆర్టీఏ సర్వర్ సమస్య భయపెడుతోంది. అయితే రవాణాశాఖ ఉన్నతాధికారులు మాత్రం వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సేవలు అందేలా చూస్తున్నామని తెలిపారు.
తరచూ సమస్యలు..
రవాణాశాఖ ఆన్లైన్ సేవల కోసం ఉపయోగించే సర్వర్‌లో తరుచుగా సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలోనూ అనేకసార్లు సర్వర్‌లో సమస్య కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆర్టీఏ సేవలను నిలిపివేశారు. ఒకసారి సర్వర్‌కు విద్యుత్ అందించేందుకు ఏర్పాటు చేసిన జనరేటర్లో మంటలు తలెత్తడంతో సేవలను నిలిపివేశారు. ఫలితంగా ఆరోజు సేవలను పొందని వారికి మరుసటిరోజు అవకాశం కల్పించారు. మరోసారి హార్డ్‌వేర్ సమస్య కారణంగా సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు రెండు రోజులుగా కురిసిన వర్షాలకు సర్వర్ కేబుల్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వర్ డౌన్ కావడానికి కారణమైనట్టు ఆర్టీఏ అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈసారి ఎక్కడ సేవలు నిలిచిపోవడం గానీ.. లావాదేవీలు రద్దు వంటి జరగలేదనీ.. కేవలం స్లాట్ బుక్స్ కావడంలో సమస్య తలెత్తినట్టు చెబుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం రవాణాశాఖలో ఏర్పాటు చేసిన సర్వర్లు సుమారు 15 ఏండ్ల కింద పెట్టినవి. వాస్తవానికి ప్రతి అయిదేండ్లకు ఒకసారి సర్వర్ అప్‌గ్రేడ్ చేయించాల్సి ఉంటుంది. కానీ అది జరగకపోగా.. సర్వర్ సామర్థ్యానికి మించి భారం వేస్తుండడంతో తరుచూ ఏదో ఒక సమస్య వస్తోంది. నిత్యం జరిగే లావాదేవీలను సర్వర్‌లో భద్ర పరుస్తుంటారు. కానీ స్టోరేజీ కెపాసిటీ పెంచుకుని దానిపై రవాణాశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించడంలేదని తెలుస్తోంది. గతంలో కొంతమేర స్టోరేజీ కెపాసిటీ పెంచినట్టు సమాచారం. మొత్తానికి దశాబ్దం క్రితం ఉన్న స్టోరేజీతోనే నెట్టుకొస్తున్నారనీ.. రవాణాశాఖలో ఆర్టీఏ ఆన్లైన్ సేవలు అంతకంతకు పెరుగు తుండడంతో అందుకు అనుగుణంగా సర్వర్‌ను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆర్టీఏ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే.