Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ, ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు
- రాంపల్లిలో అక్రమ లేఔట్లో బఫర్ జోన్
- స్థలాన్ని గుర్తించిన అధికారులు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
బఫర్‌జోన్ స్థలాన్ని కబ్జాచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. నాగారం మున్సిపాలిటీ పరిధి, రాంపల్లి ఎర్రమల్లె వాగు బఫర్‌జోన్ స్థలాన్ని కాపాడాలని రాంపల్లి వాసులు మేడ్చల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు స్పందించారు. ఎర్రమల్లె వాగు సమీపంలోని అక్రమ లేఔట్లో ఉన్న బఫర్‌జోన్ స్థలాన్ని అధికారులు గుర్తించారు. అక్కడి ఇంటినిర్మాణంవద్దకు వెళ్లే రోడ్డును జేసీబీతో తవ్వారు. రాంపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లు 237, 238 ఎర్రమల్లె వాగు వెంబడి ఆనుకుని ఉన్నటువంటి బఫర్ జోన్ స్థలాన్ని, సర్వే నెంబర్లు 237, 238, 239, 240,241 లలో చేస్తున్న లేఔట్‌కు సంబంధించి ఈ ఫిర్యాదు చేశారు. లేఔట్ చేసిన స్థలంలో బఫర్ జోన్‌ను కలుపుకొని, వాగుకు ఆనుకొని రోడ్లు నిర్మించి, ప్లాట్లు చేసి కబ్జా చేస్తున్నారని రాంపల్లి వాసులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ లే అవుట్లో, ఎమ్రల్లెవాగు పరిధి బఫర్ జోన్ స్థలంలో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కమిషనర్ వాణి రెడ్డి, ఇరిగేషన్ అధికారి ప్రశాంత్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.