Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటోన్మెంట్ బోర్డు పాలకమండలి సమావేశంలో చర్చించిన సభ్యులు
- ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న హాజరు
- ప్రతి అంశంపైన సుదీర్ఘ చర్చతో కొనసాగిన సమావేశం
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ట్రేడ్ లైసెన్సుల జారీ, బోర్డు స్థలాల ఆక్రమించి గేట్లు నిర్మించడం, హోర్డింగుల ప్రకటనలపై గురువారం పాలకమండలిలో సుదీర్ఘ చర్చ జరిగింది. బోర్డు కార్యాలయంలో జరిగిన సమావేశానికి బోర్డు అధ్యక్షుడు సోమశంకర్ అధ్యక్షత వహించారు. సీఈవో అజిత్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, నామినేటెడ్ సభ్యుడు జె. రామకృష్ణ పాల్గొన్నారు. పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంలో 8 వార్డులలో ట్రేడ్ లైసెన్స్ విషయంపై అడ్వర్టయిజ్మెంట్ హోర్డింగుల ఏర్పాటుపై, రక్షణ స్థలాల్లోనూ ట్రేడ్ లైసెన్సుల అమలు అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం బోయిన్పల్లిలో కాంగ్రెస్పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం వచ్చిన అనుమతిపై ఎమ్మెల్యే చర్చించారు. నామినేటెడ్ సభ్యుడు, రామకృష్ణ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మధ్య సుధీర్ఘ చర్చ నడిచింది. కీ.శే., ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి బోయినపల్లిలో పదెకరాల స్థలాన్ని అప్పట్లో కేటాయించారు. తాజాగా ఈ స్థలంలో కార్యాలయ నిర్మాణానికి పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి పేరిట భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అనుమతి విషయంపై రేవంత్రెడ్డి కూడా ప్రస్తావించారు. దీనిపై ఎమ్మెల్యే సాయన్న, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మధ్య చర్చ తర్వాత అనుమతిని తిరస్కరించారు. అలాగే పలు కాలనీల సంక్షేమ సంఘాల వారు కంటోన్మెంట్ స్థలాలను తమ ప్రయివేటు ఆస్తులుగా పరిగణిస్తూ గేట్లు ఏర్పాటు చేసుకుంటున్నారని, వాటిని తొలగించాలని పలువురు సభ్యులు కోరారు. గత బోర్డు సమావేశంలో నిర్ణయించిన మేరకు అక్రమ హోర్డింగులపై భారీ జరిమానాలు విధించేందుకు తీర్మానించారు. బోర్డు సమావేశం మొత్తం రెండుగంటలపాటు చర్చోప చర్చలతో కొనసాగింది. మొదటిసారిగా రేవంత్రెడ్డి రావడ, అలాగే ఎమ్మెల్యే సాయన్న కూడా సమావేశానికి హాజరు కావడంతో టీఆర్ఎస్,కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి తరలి వచ్చారు. సమావేశం అనంతరం వెళ్లిపోయే ముందు బయట ఆయా పార్టీల నేతలకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు.