Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ వెంటనే జీవోను విడుదల చేయాలని గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం కేపీహెచ్‌బీ రోడ్‌నెంబర్ -1లో గాంధీవిగ్రహంవద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో జీవో విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణనాయక్ మాట్లాడుతూ... గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెంచుతూ వారంరోజుల్లో జీవో ఇస్తానని ఈ నెల 17న సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు జీవోను విడుదల చేయలేదన్నారు. జీవో విడుదల చేసి అన్ని ఉద్యోగ నియమాకాల్లో 10 శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనేక పోరాటాల ఫలితంగా సీఎం ఈ ప్రకటన చేశారని, అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలిపారు. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు కోరారు జాప్యం జరిగితే గిరిజనులు పోరాటానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జే. శివకుమార్, కూకట్పల్లి మండల కార్యదర్శి ఆర్. చిరంజీవి, నాయకులు భాష, పుల్లయ్యప్ప నాయక్ పాల్గొన్నారు.