Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు జిల్లాల్లోనే 77.65లక్షల వాహనాలు
- 18 శాతం పెరిగిన వ్యక్తిగత కార్లు
- తప్పని ట్రాఫిక్ తిప్పలు
- వాహన విస్పోటనం దిశగా గ్రేటర్ పరుగులు
- హైదరాబాద్‌లో ట్రాఫిక్
- సమస్యనివారణకు ప్రత్యేక చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకనుగుణంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య సైతం పెరుగుతోంది. ముఖ్యంగా రెండేండ్లలో కొవిడ్ తీవ్రత కారణంగా నగరంలో వ్యక్తిగత వాహనాలు 18 శాతం పెరిగాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు కూడా భారీగా పెరిగాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సివస్తోంది. వర్షం వస్తే మరీ నరకం. వీటితోపాటు నగరంలో సరైన పార్కింగ్ వ్యవస్థలేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నా ఉల్లంఘనుల సంఖ్య తగ్గడంలేదు. అయితే ఏడాది కాలంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. పోలీసుల సరికొత్త ప్రణాళికలో భాగంగా అక్రమ పార్కింగ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించడానికి ఇచ్చే ప్రాధాన్యత, ఇతర అంశాలను సిటీ పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గురువారం వివరించారు. జాతీయ రహదారులతో నగరానికి కనెక్ట్ అవుతున్న రోడ్లు, నగరంలోని అంతర్గత రహదారుల కబ్జా, ఫుట్‌పాత్ ఆక్రమణలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతోనే ప్రధాన సమస్యలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
77.65 లక్షల వాహనాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో 2019లో వాహనాల సంఖ్య 64 లక్షలు ఉంటే ప్రస్తుతం నగరంలో 77.65 లక్షల వాహనాలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రోడ్డు రవాణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 13,63,005 వాహనాలు పెరిగాయి. వీటిలో మోటార్ సైకిళ్లు 9,81,739, కార్లు 2,83,191, ఆటోరిక్షాలు 12,031, గూడ్స్ క్యారేజ్స్ 53,986, మోటారు క్యాబ్‌లు 10,892, ట్రాక్టర్, ట్రైలర్స్9,039, మ్యాక్సీ క్యాబ్‌లు 3,286, విద్యాసంస్థల బస్సులు 2,678, ఇతర వాహనాలు 4,493 పెరిగాయి.
పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు ఇలా
నగరంలో పార్కింగ్ వ్యవస్థ ఎలా ఉండాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ 2012లో జారీచేసిన జిఓఎంఎస్ 168 ప్రకారం మల్టీఫ్లెక్స్‌లో 60శాతం, మాల్స్‌లో 60శాతం, హోటల్స్, లాడ్జీలు, కమర్షియల్ బిల్డింగ్స్ 40శాతం, కాంప్లెక్స్‌లు, విద్యాసంస్థల్లో 30శాతం పార్కింగ్‌కు కేటాయించాలని నిబంధన ఉంది. కాని ఎక్కడా అమలు కావడంలేదు. రోడ్లపై, షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్స్ వద్ద అక్రమ పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు పెరిగి పోతున్నాయి. అయితే పార్కింగ్ ఏర్పాటు చేయని సంస్థలపై చర్యలు తీసుకోకుండ వాహన దారులపై పార్కింగ్ పేరుతో పెనాల్టీ వేస్తున్నారనే విమర్శలూలేకపోలేదు.
కఠిన చర్యలు
రోడ్లపై వాహనాల స్టాప్‌లైన్ నిబంధన, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ప్లేట్లు సరిగా లేని వాహనాలు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, సీట్‌బెల్ట్ లేకపోతే, కార్లకు బ్లాక్ ఫిలింలు వంటి అంశాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బస్‌బేలను ఏర్పాటు చేసి బస్సులను బస్టాపుల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోనున్నారు. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు ఆటోడ్రైవర్లు, స్కూల్ బస్సుల డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లకు బస్బేలలలో వాహనాలు నిలపడంతో ఏర్పడే ఇబ్బందుల గురించి అవగాహన కల్పించనున్నారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి సైన్‌బోర్డులు ఏర్పాటుతోపాటు ఫ్రీలెఫ్ట్ సక్రమంగా వినియోగించేలా, యూ టర్న్‌ల వద్ద సేఫ్ టర్నింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. షార్ట్‌ఫిలింలు, సోషల్‌మీడియా ద్వారా కూడా ట్రాఫిక్ నిబంధనలు, వాటి అమలు గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి అదనంగా 40 మంది ఎస్ఐలు, 100 మంది హౌంగార్డులను కేటాయించనున్నారు.