Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- గాంధీ హాస్పిటల్ వద్ద పనుల పరిశీలన
నవతెలంగాణ-బేగంపేట్
గాంధీ హాస్పిటల్ ఎదుట ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని నేడు ఆదివారం సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం గాంధీ విగ్రహం జరుగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ హాస్పిటల్ ఎదుట ఏర్పాటు చేస్తున్న 16 ఫీట్ల గాంధీ విగ్రహ పనులను, బహిరంగ సభ జరిగే హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమరు కుమార్, విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్, నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పరం జ్యోతి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా ఉదయం 10.30 గంటలకు ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి పార్క్ లైన్, ప్యాట్నీ సిగల్, క్లాక్ టవర్, సంగీత్, చిలకలగూడ చౌరస్తా మీదుగా గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకుని హాస్పిటల్ ఎదుట ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీ విగ్రహన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీ మహాత్ముడు అని పేర్కొన్నారు. గాంధీ జయంతి రోజున ఆయన్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించారని చెప్పారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు, రాధాకృష్ణ, హఫీజుద్దీన్, వసంత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, తదితరులు ఉన్నారు.