Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
సీఎన్జీ గ్యాస్ 40శాతం పెంపును వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ అధ్వర్యంలో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు శనివారం తుర్కయంజాల్ చౌరస్తాలోని నాగార్జునసాగర్ హైవే రోడ్డుపై రాస్తారోకో చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కిషన్, రంగారెడ్డి జిల్లా తెలంగాణ రోడ్ ట్రాన్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి రుద్రకుమార్లు ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు ట్రాన్పోర్ట్ట్ కార్మికులపై ఇంధనం ధర పెంచుతూ వారి జీవితాలతో ఆటలాడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నేచురల్ గ్యాస్ ధర సీఎన్జీ ధరను 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇది యదావిధిగా ఆరు నెలల వరకు కొనసాగుతుందని, అదీ శనివారం నుంచే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గ మైన చర్య అని అన్నారు. వెంటనే పెంచిన నేచురల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, అదే మాదిరిగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై జీఎస్టీిని వర్తింపజేసి ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కార్మికు లందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ సబ్సిడీతో కూడిన కొత్త వాహనాలను ప్రభుత్వాలు కార్మికులకు అందివ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అశోక్, తుర్కయంజాల్ టాటా ఏసీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఎన్.ధర్మారెడ్డి, నాయకులు గుండా బాలరాజ్, ఎస్.వెంకట్‌రెడ్డి, బద్దం చెన్నారెడ్డి, లింగారెడ్డి, యాదగిరి, హనుమంత్‌రెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.