Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిదశలో 239 పాఠశాలల ఎంపిక
- మనబస్తీ-మనబడిలో మరో ముందడుగు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సర్కారు పాఠశాలలకు కొత్త హంగులు సంతరించుకోను న్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల భవనాలను ఆకర్షిణీయమైన రంగులతో తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలావుంటే మనబస్తీ- మన బడిలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిది రకాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా తొలిదశలో 239 పాఠశాలలను ఎంపిక చేసి.. పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లు తెరిచే నాటికి మండలానికి కనీసం రెండు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినప్పటికీ.. ఆ దిశగా పనులు సాగలేదు. దాదాపు అన్ని స్కూళ్ల అంచనాలు పూర్తి చేసినప్పటికీ నిధులు మంజూరులో జాప్యం జరుగుతోంది. ఆ కారణంగా పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ విషయమై ఇటీవల జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు.
అలాగే ఈ దసరా సెలవుల్లో.. ప్రతి మండలానికి కనీసం రెండు పాఠశాలలకు రంగులతో ముస్తాబు చేయాలని దిశానిర్దేశం కూడా చేశారు. అంతేగాక ఎలాంటి రంగులో వేయాలో కూడా సూచించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు గతంలో ఉన్న రంగులను పూర్తిగా తొలగించి.. ఎక్కవ కాలం ఉండేలా కొత్త రంగులు వేయాలని ఆదేశించారు. అలాగే పనులు పూర్తయిన వెంటనే పనివాళ్లకు డబ్బులు చెల్లించాలని.. ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారని సమాచారం. కాగా మనబస్తీ- మనబడిలో భాగంగా ఇప్పటికే పలు పాఠశాలల్లో సీలింగ్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్స్, తాగునీటి సంపు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఇతర సివిల్ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలను ముస్తాబు చేయాలంటే మొదటగా అంచనాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పనులు జరగలేదని తెలుస్తోంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మరో వారం రోజుల్లో దసరా సెలవులు ముగియనున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా పెయింటింగ్ పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రభుత్వ పాఠశాలల పట్ల అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.