Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ/సిటీబ్యూరో/అంబర్పేట
గిరిజన రిజర్వేషన్ను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గిరిజన సంఘాల నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కరాటే రాజు నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ పెంపుతో అనేక గిరిజన కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని ప్రశంసించారు. గిరిజన విద్యార్థుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల జనాభా పది శాతం ఉన్నప్పటికీ, వారికి విద్య, ఉద్యోగాలలో ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండటంతో తీవ్రంగా నష్టపోయారని, వారి రిజర్వేషన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దీనిపై యావత్ గిరిజన జాతి హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. కేసీఆర్కు రాష్ట్రంలోని గిరిజన ప్రజలందరూ రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు గుగులోత్ శ్రీరామ్ నాయక్, పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొ. లక్ష్మీకాంత్ రాథోడ్, నేషనల్ బంజారా ప్రొఫెసర్స్ అసోసియేషన్ (ఎన్పీపీఏ) అధ్యక్షుడు డాక్టర్ ఆర్. చంద్రునాయక్, ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొ.మంగు, ప్రొఫెసర్ గోపాల్ నాయక్, డాక్టర్ బాలు, వాణిజ్యపన్నుల శాఖ అధికారి డాక్టర్ ధనంజయనాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన రిజర్వేషన్ 10% పెంపుపై హర్షం వ్యక్తంచేస్తూ గిరిజన సంఘాల ప్రతినిధులు రవీందర్ నాయక్, సురేష్ ధరావత్, చందులాల్ రాథోడ్, నాగానాయక్, రవికుమార్ వినోద్ రాథోడ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజనులకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేయడంపై హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్(జేటీసీ) జె.పాండురంగ నాయక్ హార్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ పెంపుతో రాష్ట్రంలోని అనేక గిరిజన కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని కొనియాడారు. రాష్ట్రంలో గిరిజనుల జనాభా పది శాతం ఉన్నప్పటికీ, వారికి విద్య, ఉద్యోగాలలో ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతుండడంతో తీవ్రంగా నష్టపోయారనీ, వారి రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయడం గిరిజనుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శమని జేటీసీ తెలిపారు.