Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశంలో శాంతి, మత సామరస్యం, సోదరభావాన్ని బోధించిన మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని మతోన్మాద శక్తులు దెబ్బ తీస్తున్నాయని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మతోన్మాద శక్తులు ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తూ, వక్రీకరించిన చరిత్ర ఆధారంగా విద్యా పాఠ్యాంశాలను రూపొందిస్తాయని ఆనాడే మహాత్మా గాంధీ హెచ్చరించారని, నేడు వారు నిజం చేస్తున్నారని తెలిపింది. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి ఉత్సవాలను సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌నగర్‌లోని అమత ఎస్టేట్స్, ఐపీసో రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డా.డి.సుధాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్జీ వినోద్ రెడ్డి, ఐపీసో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, తెలంగాణ వర్కింగ్ విమెన్ ఫోరమ్ కన్వీనర్ ప్రేమ్ పావని, ఐపీసో రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు రఘుపాల్, తిప్పర్తి యాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు తదితరులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డా.డి.సుధాకర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస సూత్రాలను అనుసరించడం ద్వారా హింసకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. గాంధీ అహింసా ఉద్యమంతోనే భారతదేశానికి స్వాతంత్రం సిద్దించిందని గుర్తు చేశారు. శాంతి, అహింస అనేవి రెండు స్తంభాలు అని, అవి మానవ జాతి జీవనోపాధిని నిలబెడుతాయని, జీవనోపాధి నిలబడితే మానవ జాతి వికసిస్తుందని గాంధీజీ సందేశం అని అందుకే మహాత్మా గాంధీని గొప్ప శాంతి దూత అని ఉంటారన్నారు. కేవీఎల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సూచించిన పద్ధతుల్లోనే అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ప్రజల మధ్య శాంతి, సంఘీభావం, స్నేహాన్ని పెంపొందించడం కోసం కషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐపీసో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామరాజు, సినీ నటి ప్రీతీ నిగమ్, పడాల నళిని, మంజరి, భారతి, రాజేశ్వర్ రావు, బాలయ్య యాదవ్, రాకేష్ సింగ్, వేణు, జావేద్ తదితరులు పాల్గొన్నారు.