Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రజా సంక్షేమమే తమ జీవిత లక్ష్యం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఎంతో మంది టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆమె తెలిపారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో నాదర్గుల్ గ్రామానికి చెందిన 500 మంది నాయకులు భాగ్యనగర్ రైతు సహకార బ్యాంకు డైరెక్టర్ ఎల్చల మమత సుదర్శన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో, అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎం.సుధాకర్ నాయకత్వంలో 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వారిని మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అన్నారు. ఉద్యమ నేతనే ముఖ్యమంత్రిగా రాష్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపటానికి కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నేడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో నూతనంగా చేరిన వారికి సముచితమైన గుర్తింపు లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ప్రజలందరికీ ముందస్తుగా దసరా పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో..
అడిక్‌మెట్ : తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న అనేక మంది యువకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం కవాడిగూడ డివిజన్ పూల్‌బాగ్ బస్తీలో బీజేపీ యువ నాయకులు సందీప్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని తెలిపారు. యువత కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచ డానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సాయి, కరికే కిరణ్, బసవరాజ్, సాయి, నాగేష్, నీరజ్, శశి, శ్రీకాంత్, అజరు, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.