Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ పూర్తి మద్దతు తెలుపుతుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ భాస్కర్ ముల్కల ప్రకటించారు. కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్లోని హరిహరకళా భవన్లోసమావేశాన్ని నిర్వహించారు. 33 జిల్లాల నుంచి కౌన్సిల్ ప్రతినిధులు, పాస్టర్లు, క్రైస్తవ నాయకులు హాజరై ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం క్రైస్తవ సమాజానికి తీవ్ర నష్టం కలుగచేయడంతో పాటు లౌకికత్వానికి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వీటిని కాపాడుతుందనే నమ్మకంతో మద్దతు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే బిల్లు, మత మార్పిడి నిరోధక అక్రమ చట్టాలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అందేలా, భద్రత తదితర అంశాలపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో చావల జోసఫ్, పాస్టర్ రూబెన్, ప్రభాకర్, చక్రిపాల్, ప్రసాద్, సుధీర్, బెంజమీన్ రాజు తదితరులు పాల్గొన్నారు.