Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర రాష్ట్రాలకు గంజాయి, నగరానికి డ్రగ్స్, ఎర్రచందనం సరఫరా
- పోలీసుల కండ్లు గప్పి దందా
- మాదక ద్రవ్యాల మాఫియాను అరికట్టాలంటున్న ప్రజలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మాదకద్రవ్యాల మాఫియాలు, ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. యువకులను, విద్యార్థులను, ఉన్నతవర్గాలు, సీనీ పరిశ్రమకు చెందిన వారితోపాటు ఐటీ ఉద్యోగులను డ్రగ్స్ మాఫియా ఎంచుకుంటుంటే, ఎర్రచందనం స్మగ్లర్లు వ్యాపారులకు గాలం వేస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నగర శివార్లును ఎంచుకుని కొందరు డ్రగ్స్‌ను, గంజాయిని, ఎర్రచందనాన్ని డంప్ చేస్తున్నారు. మరికొందరు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తున్నారు. ఓఆర్ఆర్ మీదుగా గుట్టుచప్పుడు కాకుండా చేరాల్సిన చోటుకు చేరుస్తున్నారు.
పీడీ యాక్టు నమోదు చేసినా...
ఒక్కసారి మాదకద్రవ్యాలకు అలవాటైన వారే బానిసలుగా మారి గంజాయి, డ్రగ్స్ సరఫరాదారులుగా, ఏజెంట్లుగా మారుతున్నారు. వీరిని ఆసరా చేసుకుని స్మగ్లరు రెచ్చిపోతున్నారు. రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా వేసినా, పీడీ యాక్టులు నమోదు చేసినా గుట్టుచప్పుడు కాకుండా పనిగానిస్తున్నారు. డ్రగ్స్స్మగ్లర్లు గోవా, ముంబాయి, ఢిల్లీ, కర్ణాటక, బెంగుళూరు తదితర రాష్ట్రాల నుంచి సరఫరా చేస్తుంటే, గంజాయి స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్‌గడ్‌తోపాటు తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకొస్తున్నారు. నగరంలోని శివారు ప్రాంతాల్లో వాటిని నిల్వచేస్తున్నారు. ఇక్కడి నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ముంబాయి తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ప్రత్యేక నిఘా వేసినా, దేశవ్యాప్తంగా ఉన్న స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నా మాదక ద్రవ్యాల దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా హయత్‌నగర్, ఎల్బీనగర్ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. వారి నుంచి రూ.2కోట్ల 80 లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా మూడు రోజుల క్రితం నగర పోలీసులు ఎర్రచందనం ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితుల నుంచి రూ.75లక్షల విలువగల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రతీనెల ఏదోచోట గంజాయి పట్టుపడుతూనే ఉంది.
రాష్ట్రాలు దాటుతున్నా...
దేశవ్యాప్తంగా ఎర్రచందనం, మాదక ద్రవ్యాల ముఠాలు రెచ్చిపోతున్నాయంటే స్థానికంగా కొందరు పోలీసులు, సంబంధిత అధికారుల సహాయసహకారాలు లేకపోలేదన్న విమర్శలున్నాయి. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తదితర రాష్ట్రాల సరిహద్దులు దాటి హైదరాబాద్ శివారు ప్రాంతాల వరకు గంజాయి చేరుతోంది. ఆయా చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంటుంది. అయినా అవి దాటి కిలోలకొద్ది గంజాయి, క్వింటాళ్ల కొద్ది ఎర్రచందనం లోడుతో ట్రక్కులు, డీసీఎంలు, కార్లు సిటీలోకి ప్రవేశిస్తున్నాయంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
సహకరించని స్థానిక పోలీసులు
గోవా, ఢిల్లీ, ముంబాయి, రాజస్థాన్, బెంగుళూరు తదితర రాష్ట్రాల్లో అడ్డావేస్తున్న నైజీరియన్లతోపాటు స్థానిక స్మగ్లర్లు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుం టున్నారు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, చరస్, ఎక్స్టసీ వంటి మాదకద్రవ్యాలను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. బీటెక్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలను, యువతను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు.
మాఫియాల ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించిన హైదరాబాద్, రాచకొండ పోలీసులు డ్రగ్స్ మూలాలపై దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ కలిగివున్న స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నారు. గోవా ముంబాయి, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దర్యాప్తులో భాగంగా మన పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి విచారణ చేపడితే ప్రధాన స్మగ్లర్లకు తెలిసిపోతోంది. డ్రగ్స్, గంజాయి మాఫీయాకు అడ్డుకట్ట వేసే దిశగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.