Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా జాతీయ అధ్యక్షులు డా.హిప్నో పద్మా కమలాకర్
నవతెలంగాణ-అంబర్పేట
బాలికల ఆరోగ్యమే దేశ శ్రేయస్సు అని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా జాతీయ అధ్యక్షులు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. గురువారం హైదర్గూడా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 'బాలికల విద్య, ఆరోగ్యం'పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులు, సర్టిఫికెట్లు, నెల రోజులకు సరిపడా పోషకాహారం అందజేశారు. ఈసందర్భంగా పద్మా కమలాకర్ మాట్లాడుతూ బాలికల్లో జ్ఞానం పెంచడం, తమను తాము రక్షించుకోవడంపై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, స్మార్ట్ఫోన్లు ప్రజల మానసిక ఆరోగ్యాన్ని హరించడంలో ముందుంటున్నాయన్నారు. కొంతమంది పనిగట్టుకొని అవాస్తవాలను పోస్ట్ చేస్తూ సమాజంలో ఆందోళనలను రేకెత్తిస్తున్నారన్నారు. నిద్రలేమి, చదువు, కుటుంబ సభ్యులకు తగిన సమయాన్ని వెచ్చించకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్నారన్నారు. మానసిక సమస్యలు ఉన్నట్లు బయటికి చెబితే సమాజం చులకనగా చూస్తుందన్న భయంతో వైద్య సహాయం పొందడానికి చాలామంది జంకుతున్నారన్నారు. రాష్ట్రంలోనే లైంగిక వేధింపులు అధికంగా ఉన్నాయన్నారు. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు బాలికే ఉంటుందన్నారు. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించడం, వారి సాధికారత కోసం కృషి చేయడం, హక్కులు పొందడంలో వారికి సహాయపడటం వంటి లక్ష్యాలతో ఏటా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని చెప్పారు. 'ఇది మన సమయం- మన హక్కులు, మన భవిత' ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవ నినాదమని తెలిపారు. కుటుంబాల్లో, సమాజంలో వారి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చన్నారు. బాలికలకు సరైన నైపుణ్యాలను, అవకాశాలను అందిస్తే మరింతగా రాణించి సమాజంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో లయన్ జి.కృష్ట వేణి, డా.జే.రాజశ్రీ, స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ రాధా రాణి, టీచర్ అర్చన విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.