Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగువ ప్రాంతపు డ్రయినేజీలతో చెరువులోకి పారుతున్న మురుగు
- దుర్వాసన, దోమల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న చుట్టు పక్కల ప్రజలు
'ఎల్లమ్మ చెరువును బాగు చేయరా? ఇంకా ఎన్నిళ్లిలా? ' చెరువు పరిసర ప్రాంతాలవారు అడుగుతున్న ప్రశ్నలివి. ఓ వైపు చెరువులను సంరక్షిస్తామని చెప్తున్న ప్రభుత్వం, అధికారులు ఇక్కడి చెరువును మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి డ్రయినేజీ ద్వారా ప్రవహించే మురుగు నీరు చేరి దుర్వాసన వెదజల్లుతోందని, దోమల పెరుగుదలతో రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-కూకట్పల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, జయనగర్ సమీపంలో ఎల్లమ్మ చెరువు ఉంది. ఇందులోకి డ్రయినేజీ మురుగు చేరి, చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద పెరిగి పరిసర ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలు తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఒకప్పుడు ఈ చెరువులో నీరు ఎంతో తేటగా ఉండేది. స్థానికులు చేపలు పట్టుకునేవారు. చుట్టు పక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. కానీ నేడు డ్రయినేజీ మురుగు నిండిపోయి కంపుకొడుతోంది. చుట్టు పక్కల నుంచి వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకిలా..
చెరువుకు ఎగువన ఉన్న కాలనీల్లోని డ్రయినేజీని పైప్‌లైన్ ద్వారా చెరువులోకి మళ్లించడంవల్లే సమస్య ఎదురవుతోంది. జయనగర్ కాలనీ వాసులు, ఇక్కడి సోల్ ఆర్గనైజేషన్ సభ్యులు మాట్లాడుతూ... అధికారుల స్వార్థం, నాయకుల నిర్లక్ష్యంతో చెరువు మురికి కూపంగా మారుతోందని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబీర్ చెరువులో ఉండే మురుగు నీటిని, ఎగువ ప్రాంతంలోగల సాయిచరణ్ కాలనీ, ఆదిత్య నగర్, హెచ్ఎంటీ హిల్స్, జల, వాయు విహార్ ప్రాంతాల్లోని డ్రయినేజీ మురుగు, వర్షం పడినప్పుడల్లా వరదనీరు, కాలువల ద్వారా ప్రవహించే చెత్తా చెదారం ఎల్లమ్మ చెరువులోకి వస్తోంది తెలిపారు. దీనివల్ల ఇక్కడ దుర్వాసన భరించలేనంతగా ఉంటోందని, రోగాలబారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని చెప్పారు. దుర్వాసన, దోమల బెడదకు సాయంత్రమైతే చాలు తలుపులు మూసుకుంటామని జయనగర్ కాలనీ వాసులు తెలిపారు. చెరువులోకి ఎగువ నుంచి వస్తున్న డ్రయినేజీ, మురుగునీటిని దారిమళ్లిస్తే ఎల్లమ్మ చెరువుకు పూర్వ వైభవం వస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఎల్ల చెరువులోకి మురుగునీరు రాకుండా చూడాలని స్థానిక సోల్ ఆర్గనైజేషన్ సభ్యులు బాలస్వామి, వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణారావు, విష్ణు, కృష్ణయ్య, వెంకట్‌రెడ్డిలు ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను కోరారు. ఎల్లమ్మ చెరువులో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.