Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ ఆఫీసు వద్ద ధర్నాలో నగర అధ్యక్షప్రధాన కార్యదర్శులు జె.కుమారస్వామి, కిరణ్మయి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నగర అధ్యక్షప్రధాన కార్యదర్శులు జె.కుమారస్వామి, కిరణ్మయి డిమాండ్ చేశారు. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. 11వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.31,040తోపాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్‌లు ఇవ్వాలని కోరారు. 20 ఏండ్లుగా పనిచేస్తున్న సమస్యలు పరిష్కరించడంలేదని, ఎన్హెచ్ఎం, 2వ ఏఎన్ఎం, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు, ఇతర ఏఎన్‌ఎంలందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. వ్యాక్సిన్ అలవెన్స్ రూ.500, యూనిఫామ్ అలవెన్స్ రూ.2,500, 35 రోజుల క్యాజువల్ లీవులు, 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, మెడికల్ లీవులు, సబ్ సెంటర్ అద్దె రూ.1500, స్టేషనరీ, జిరాక్స్ ఖర్చులను ఇప్పించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించినవారికి ఎక్స్‌గ్రేషియో, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, వైద్యారోగ్యశాఖ బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించి పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటి కన్వీనర్ ఆర్.వాణి, తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.కవిత, నగర ఉపాధ్యక్షులు పి.లక్ష్మి, ఉద్యోగులు పాల్గొన్నారు.