Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు హైదరాబాద్‌కు డీఏవీ ఢిల్లీ ప్రతినిధుల బృందం
- పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌తో భేటీ
- విద్యార్థుల సర్దుబాటు, ఫీజులు, మేనేజేమెంట్ మార్పుపై
చర్చలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల సమస్యను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు విద్యాశాఖ సీరియస్‌గా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా నేడు డీఏవీ పాఠశాల ఢిల్లీ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌కు రానుంది. నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం జరిగిన వివిధ పరిమాణాల నేపథ్యంలో డీఏవీ స్కూల్ ప్రతినిధుల బృంద సభ్యులు బుధవారం మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా విద్యాశాఖ సూచించిన మూడు ప్రతిపాదనలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా డీఏవీ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు, విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు చేపట్టడం, ఇతర స్కూళ్లకు మార్చితే ఫీజుల చెల్లింపులు, తల్లిదండ్రుల డిమాండ్ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారి పర్యవేక్షణ లేదా కొత్త మేనేజేమెంట్తో డీఏవీ స్కూల్ రన్ చేసే అంశంపై చర్చలు జరపనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధ్యానత సంతరించుకుంది.
బీఎస్‌డీ డీఏవీ పాఠశాలలో ఎల్కేజీ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు కారణమైన బంజారాహిల్స్‌లోని బీఎస్‌డీ డీఏవీ పాఠశాల గుర్తింపును ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ రద్దు చేసింది. అయితే పాఠశాల రద్దుతో ఇందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు. పాఠశాల రద్దు చేయకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని విద్యాశాఖ మంత్రితో పాటు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా ఆ పాఠశాలకు మూడు కి.మీల పరిధిలోపు ఉన్న ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే వారి తల్లిదండ్రుల సందేహాల నివృత్తితో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ విద్యార్థుల తల్లిందండ్రులు మాత్రం తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయకూడదనీ, విద్యాసంవత్సరం మధ్యలో ఇలాంటి చర్యలు తీసుకుంటే వారు నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓ కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలను కొనసాగించాలనీ.. గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే సఫిల్ గూడ, కేబీఆర్ పార్కు వద్ద రెండుసార్లు ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మంగళవారం హైదరాబాద్ డీఈవో కార్యాలయం ఆవరణలో కొంతమంది తల్లిదండ్రులు సమావేశమై సంతకాలు చేశారు. అవన్నీ కలిపి బుధవారం విద్యాశాఖ డైరెక్టర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తానికి ఢిల్లీ ప్రతినిధుల బృందంతో పాటు అటు తల్లిదండ్రులు డైరెక్టర్‌ను కలువాలని నిర్ణయించడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ముందుకొచ్చిన ప్రముఖ స్కూల్..
డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నిర్ణయం దాదాపు 700మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది. మరోపక్క డీఏవీ పాఠశాల విద్యార్థుల సర్దుబాటుకు సంబంధించి మూడు కి.మీ పరిధిలో ఉన్న పాఠశాల మేనేజేమెంట్లతో విద్యాశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పాఠశాల (సీబీఎస్ఈ సిలబస్) ముందుకొచ్చింది. ఈ విద్యార్థులందరిని తమ పాఠశాలలో చేర్పించుకుని పాఠాలు చెప్పేందుకు సిద్ధమని, తమకు తరగతి గదులు, ఫ్యాకల్టీతో పాటు విద్యాబోధనకు ఎలాంటి ఇబ్బంది లేదనే విషయాన్ని ఇప్పటికే విద్యాశాఖకు తెలిపింది. అంతేకాకుండా ఈ ఏడాది డీఏవీ పాఠశాలకు ఎంత ఫీజు చెల్లిస్తున్నారో ఆ మేరకు తీసుకునేందుకూ సుముఖత వ్యక్తం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డీఏవీ పాఠశాలలో డొనేషన్ రూ.75వేలు ఉందని, ఫీజు రూ.50వేల వరకు ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఫస్ట్, సెకండ టర్మ్ ఫీజులు తల్లిదండ్రులు చెల్లించినట్టయితే.. తిరిగివాటిని ఆ స్కూల్‌కు చెల్లించడం లేదా మిగతా రెండు టర్మ్‌లు చెల్లించడంపై బుధవారం జరిగే భేటీ అనంతరం ఓ క్లారిటీ రానుంది. అయితే ఇదే సమయంలో సదరు ప్రముఖ స్కూల్లో మాత్రం ఏడాదికి రూ.2.75లక్షల ఫీజు ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ ఏడాది ఎలాగైనా డీఏవీ ఫీజు తీసుకుని పాఠాలు చెబుతారు.. కానీ, వచ్చే ఏడాది అంత మొత్తంలో ఫీజు కట్టడమంటే చాలా మంది తల్లిదండ్రులు ఆర్థిక భారంగా ఫీలవుతున్నారని సమాచారం. ఇకపోతే విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ పర్యవేక్షణలో పాఠశాలను కొనసాగించవచ్చు. తల్లిదండ్రుల విజ్ఞప్తులపై విద్యాశాఖ అధికారులూ చర్చిస్తున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.