Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పకు చెందిన గూడెళ్ళి కవిత (32) ఓ కంపెనీలో పని చేస్తుండగా గతేడాది జులై 19న విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. సుభాష్‌నగర్ డివిజన్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ బెవర ఎర్రమ నాయుడు (38) మార్చి 26న ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని రోడామేస్త్రి నగర్-బి ఏరియాకు చెందిన మహ్మద్ నాసిర్ (12) గతేడాది మార్చి 10న పతంగి మాంజా కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌తో మతి చెందారు. అయితే మృతులు నిరుపేదలు కావడంతో వారి కుటుంబాలు ఎమ్మెల్యేను ఆశ్రయించగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. వేర్వేరు ఘటనల్లో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా అధికారులను ఒప్పించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. మంజూరైన డబ్బులకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే మంగళవారం తన నివాసంలో లబ్దిదారులకు అందజేశారు.కార్యక్రమంలో విసి వేమారెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.