Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.143.58 కోట్లతో నిర్మాణం
- నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- నవంబర్, డిసెంబర్లో మరో రెండు ఫ్లైఓవర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిగల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీపీ) కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ పూర్తయింది. దీంతో ఎల్బీనగర్, కామినేని, నాగోల్, సాగర్‌రింగ్‌రోడ్డు, బైరమాల్గుడ ప్రాంతం ఫ్లైఓవర్ల జంక్షన్‌గా మారింది. అయితే ఈ ఫ్లైఓవర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖలైన హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ద్వారా మొత్తం 47 పనులు చేపట్టారు. ఎస్ఆర్డీపీ పథకం ద్వారా చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 47 పనులలో 31 పనులు పూర్తి కాగా మరో 16 పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి. పూర్తయిన 31 పనులలో 15 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాసులు, 7 ఆర్ఓబీలు/ఆర్‌యూబీలు, 1 కేబుల్ స్టాయెడ్ బ్రిడ్జి, ఒకటి పంజాగుట్ట స్టీల్‌బ్రిడ్జి, ఒకటి పంజాగుట్ట వైడెనింగ్, ఒకటి ఓఆర్ఆర్ నుంచి మెదక్ రిహబిటేషన్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి.
990 మీడర్ల పొడవుతో..
యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, ప్రాజెక్టుతో కలిపి మొత్తం రూ. 143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవుతో 6 లైన్ల, బై డైరెక్షన్‌తో నిర్మించారు. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు సిగల్ ఫ్రీ రవాణా వల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలుష్యం తగ్గుదల, వాహన వేగం పెరిగి గమ్యస్థానానికి సకాలంలో చేరుతారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరంఘర్, ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులభతరం అవుతుంది. దీంతో ఎస్‌ఆర్‌డీపీి ద్వారా చేపట్టిన పనుల్లో 16వ ఫ్లైఓవర్ అవుతుంది.
మరో రెండు ఫ్లైఓవర్లు త్వరలో ప్రారంభం
జీహెచ్ఎంసీ పరిధిలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మాదాపూర్, గచ్చిబౌలి, ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరేందుకు రెండు ఫ్లైఓవర్లు నిర్మించారు. అందులో కొత్తగూడ ఫైఓవర్ కాగా మరొకటి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. శిల్పాలేఅవుట్ ఫ్లైఓవర్‌ను నవంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్ పనులు త్వరలో పూర్తవుతాయి. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే నగరంలో ఇప్పటి వరకు మొత్తం 18 ఫ్లైఓవర్లు మెరుగైన ప్రజా రవాణాకు దోహదపడుతాయి.