Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరోజినీ కంటి ఆస్పత్రికి బాధితుల క్యూ
నవతెలంగాణ-మెహదీపట్నం
దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతూ 41 మందికి గాయాలయ్యాయి. దీంతో బాధితులు మెహదీపట్నంలోని సరోజినీ ఆస్పత్రికి క్యూ కట్టారు. వీరిలో చాలామంది పిల్లలే ఉండడం గమనార్వం. ఈసందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం మాట్లాడుతూ టపాసులు కాలుస్తూ ప్రమాదవశాత్తు కంటి గాయాలకు గురి అయినటువంటి 41 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలు అయినట్లు గుర్తించి అడ్మిట్ చేసుకున్నామని, మిగతా వారికి ప్రాథమిక చికిత్స చేసి పంపినట్లు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉందని, వారికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గాయపడ్డ వారిలో ఎక్కువమంది పిల్లలు ఉన్నట్లు చెప్పారు. గతేడాది కంటే ఈ సంవత్సరం బాధితుల సంఖ్య తక్కువగానే ఉందని, దీనికి ప్రజల్లో పెరిగిన అవగాహనే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితులు ఎంతమంది వచ్చినా వారికి చికిత్సను అందించడానికి సరిపడా డాక్టర్లు, సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు.