Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
అసెంబ్లీ-పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న విజయవాడ తుమ్మరిపల్లి కళాక్షేత్రంలో బీసీ గర్జన సదస్సు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. మంగళవారం విద్యానగర్ బీసీభవన్లో ముఖ్యనాయకుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై, రాజ్యాంగబద్దమైన హక్కుల కోసం ప్రతిపక్షాలు పార్లమెంట్లో చర్చ జరపాలని కోరారు. కులగణన చేపట్టాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని గుర్తుచేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీ లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్, సి. రాజేందర్, రాజేష్, అంటి, అనంతయ్య, సాగర్, రాజకుమార్, చంటి తదితరులు పాల్గొన్నారు.