Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సరూర్‌నగర్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనంపై నుండి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తోటి స్నేహితురాలు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన పంతం శ్రేష్ఠవి(14) చైతన్యపురిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు తనకు సరిగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, చెల్లికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఉదయం 8:30 గంటలకు పాఠశాలలో ప్రార్థన సమయానికి కిందికి వచ్చిన శ్రేష్టవి తిరిగి పైకి వెళుతున్న క్రమంలో ఓ స్నేహితురాలు నాకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకురావాలని కోరింది. అయితే ఆమె నవ్వుతూ పైకి వెళ్తున్నానని, కిందికి ఎప్పటకీి రానని చెప్పినట్లు వారు తెలిపారు. సదరు విద్యార్థి భవనంపై దూకుతుందని తాము ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రేష్టవి ప్రమాదవశాత్తు పడిందా, లేక దూకిందన్న విషయంపై స్పష్టంగా రావాల్సి ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెడ్మాస్టర్ డ్రైవర్ విద్యార్థిని కింద పడి ఉండడానికి గుర్తించి హుటాహుటిన కారులో మలక్‌పేట్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకొని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.