Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలు నిండని శిశువు మెడపై 600 గ్రాముల కణితిని తొలగించిన వైద్య బృందం
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో గురువారం అరుదైన సర్జరీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఏక్సిట్ ప్రొసీజర్ (ఎక్స్ యూటెరో ఇంట్రాపార్టమ్ ట్రీట్మెంట్) చేసి ప్రసవ సమయంలో శస్త్రచికిత్స చేసి శిశువు ప్రాణాలు కాపాడారు. వరంగల్‌కు చెందిన ఓ జంట తమ సాధారణ ప్రెగెన్సీ స్కాన్‌లో ఇంకా నెలలు నిండని శిశువు మెడమీద 600 గ్రాముల బరువు కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి శిశువుకు ప్రాణాంతకంగా పరిణమించే అవకాశముందని, వివిధ రకాల వైద్య పరీక్షల ద్వారా గ్రహించిన వైద్యులు గర్భస్రావం చేయించుకోవడం మంచిదని వారికి సూచించారు. దీంతో ఆ జంట బంజారాహిల్స్‌లోని రెయిన్బో హాస్పిటల్ వైద్య బృందాన్ని సంప్రదించింది. పరీక్షలు చేసిన వైద్యులు మెడపై ఉన్న భారీ కణితి శిశువు శ్వాసనాళం, ఆహార నాళానికి అవరోధంగా నిలిచిందని గుర్తించారు. దీంతో ఫీటల్ మెడిసన్ స్పెషలిస్ట్ డాక్టర్ గాయత్రి, డాక్టర్ స్రవంతి, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ శతి, చీఫ్ అనస్తీషియస్ట్ డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ గీత, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పీవీఎల్ఎన్ మూర్తి, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరీష్ జయరామ్, ఎన్ఐసీయూ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల, నియోనాటాలజిస్ట్ డాక్టర్ విజయానంద్ ఆధ్వర్యంలో వినూత్నమైన ఏక్సిట్ ప్రొసీజర్ (ఎక్స్ యూటెరో ఇంట్రాపార్టమ్ ట్రీట్మెంట్) శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి కణితిని తొలగించారు. నియోనాటాలజిస్ట్లు, పీడియాట్రిక్ ఈఎన్టీ స్పెషలిస్ట్‌లు, పీడియాట్రిక్ సర్జన్స్, పీడియాట్రిక్ ఎనస్తీషియస్ట్లతో పాటుగా ప్రసూతి డాక్టర్లు కూడా ఒకే చోట ఇక్కడ అందుబాటులో ఉండటం వల్ల అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నామని డాక్టర్లు వివరించారు. క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేసిన వైద్య బృందాన్ని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల ప్రత్యేకంగా అభినందించారు.