Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ఓయూ
మునుగోడు ఉపఎన్నికల్లో తాము టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు ప్రకటించారు. గురువారం తార్నాకలోని ఆసంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం చేపట్టని అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, వారు ఆత్మగౌరవంతో జీవించేలా చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది దళితులు వివిధ పథకాల్లో లబ్దిదారులుగా ఉన్నారన్నారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 90 శాతం దళితులు నిత్యం దాడులకు, అవమానాలకు గురవుతున్నారని, దీనిని దళిత సమాజం గుర్తించాలని సూచించారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకోసం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు, కేసీఆర్ కిట్, ఆసరా వంటి అద్భుత పథకాలను ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో తెలగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దమ్మ రాజశేఖర్, ఉపాధ్యక్షులు దార యోబు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు తలారి రాజు, నాయకులు కర్నె భాస్కర్, దాసు పాల్గొన్నారు.