Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్తీల్లో పర్యటించిన జలమండలి ఎండీ దానకిశోర్
- నీటి సరఫరా, నాణ్యత, సీవరేజీ నిర్వహణ పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీవరేజీ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జలమండలి ఎండీ దృష్టి సారించారు. బస్తీల్లో నీటి సరఫరా, నాణ్యత, సీవరేజీ నిర్వహణ, రిజర్వాయర్ లెవల్ మానిటరింగ్‌పై ఆరా తీస్తున్నారు. సీవరేజీ ముందస్తు నిర్వహణ చర్యల కోసం ఎయిర్‌టెక్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. నిర్వహణకు అవసరమైన బడ్జెట్ సైతం కేటాయించినా కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈక్రమంలో స్వయంగా ఎండీ దానకిషోర్ బస్తీల్లో పర్యటించి స్థానికంగా ఆరా తీశారు. బస్తీల్లో నీటి సరఫరా, నాణ్యత, సీవరేజీ నిర్వహణ, రిజర్వాయర్ లెవల్ మానిటరింగ్‌ను ఆయన స్వయంగా పరిశీలించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే.
అసంతృప్తిలో ఎండీ దానకిషోర్
బంజారాహిల్స్ దూద్‌ఖానా, షేక్‌పేట్‌లోని రిజర్వాయర్ నగరంలోని పలు బస్తీల్లో ఎండీ దానకిశోర్ పర్యటించారు. షేక్‌పేటలోని ఓయూ కాలనీ పర్యటనకు జలమండలి ఎండీ దానకిశోర్ వెళ్లిన సమయంలో ప్రధాన రహదారిపైన సీవరేజి ఓవర్‌ఫ్లో అవుతోంది. ఇది గమనించిన ఎండీ షేక్‌పేట్ సబ్ డివిజన్ డీజీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం షేక్‌పేటలోని రిజర్వాయర్‌ను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ రిజర్వాయర్ వాటర్ లెవల్ మానిటరింగ్ సిస్టమ్ పనితీరును పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. రిజర్వాయర్ మానిటరింగ్ లాగ్‌బుక్‌ను పరిశీలించారు.
సమస్యలపై బస్తీల్లో ఆరా
జలమండలి డివిజన్ - 6 పరిధిలోని బంజారాహిల్స్ దూద్‌ఖానా బస్తీలో శుక్రవారం పర్యటించారు. బస్తీలోని ప్రజలతో మాట్లాడి తాగునీటి సరఫరా ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరా, సీవరేజి నిర్వహణలో ఏమైనా సమస్యలు వస్తున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత మంచినీటి పథకం అందుతోందా అని ఆరా తీశారు. నల్లా బిల్లులు మాన్యువల్ కాకుండా ఈ-బిల్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
లోప్రెషర్ సమస్య ఉండొద్దు
గ్రేటర్లో ఎక్కడా నీటి సరఫరాలో లోప్రెషర్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎండీ ఆదేశించారు. నీటి నాణ్యత విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. సీవరేజి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు సీవరేజి ముందస్తు నిర్వహణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మ్యాన్‌హోళ్ల నుంచి తీసిన సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రిజర్వాయర్ పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, పాల్గొన్నారు.