Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
పోలీస్ ఉద్యోగాల ప్రిలిమ్స్ అర్హత పరీక్షలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. శుక్రవారం నగరంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు శనివారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద చేపట్టబోయే రెడ్డి సంఘాల దీక్షకు ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య మద్దతు తెలుపుతుందన్నారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించిన ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అభ్యర్థులను అధికారుల నిర్లక్ష్యంతో విస్మరించడం వల్ల వేలాది మందికి తీవ్రంగా అన్యాయం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ ఉద్యోగాల ప్రిలిమ్స్ అర్హత పరీక్షలో క్వాలిఫై కావడానికి పెట్టిన కట్ ఆఫ్ మార్కులు బీసీ అభ్యర్ధుల తరహాలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25 శాతం మార్కులు పెట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాళోజీ వర్సిటీ నర్సింగ్ కళాశాలల విద్యార్థుల ప్రవేశాల కోసం చేపట్టిన ప్రక్రియలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓసీలకు అన్యాయం చేయవద్దని రిజర్వేషన్లు గల అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓసీ సమాఖ్య జాతీయ సలహాదారులు పెండ్యాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చెన్నమనేని పురుషోత్తమరావు, చందుపట్ల నర్సింహ్మారెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, ఆర్య వైశ్య సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్, కమ్మ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకష్ణ ప్రసాద్, బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి పవన్ కుమార్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గూడూరి స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.