Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్స్ కాంట్రాక్టు సెక్యూరిటీగార్డు యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షులు కె.ఈశ్వర్రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిమ్స్‌లో మహిళా సెక్యూరిటీ గార్డులపై వేధింపులు ఆపాలని నిమ్స్ కాంట్రాక్ట్ సెక్యురిటీ గార్డు యూనియన్ అధ్యక్షులు కె.ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఫీల్డ్ ఆఫీసర్‌గా ఉన్న మగ్బుల్ పాష ఆరాచకాలకు వ్యతిరేకంగా, నిమ్స్ పర్మినెంట్ సెక్యురిటీ గార్డులుగా ఉన్న రామారావు, శేఖర్, సుబ్బారావులు మహిళా గార్డులపట్ల అసభ్యకరంగా ప్రవర్తనకు వ్యతిరేకంగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిమ్స్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ మగ్బుల్పాష అనే ఫీల్డ్ ఆఫీసర్ ఒక మహిళా సెక్యురిటీగార్డుని తన బండిపై గచ్చిబౌలికి తీసుకు వెళతానని అన్నాడని, దానికి ఆ మహిళా గార్డు నీ బండిమీద నేనెందుకు వస్తానని హెచ్చరించినట్టు తెలిపారు. దీంతో ఫీల్డ్ ఆఫీసర్ మగ్బుల్ పాష ఆమెపై కక్షగట్టి డ్యూటీ నుండి తొలగించే ప్రయత్నం చేశాడని తెలిపారు. మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మహిళల హక్కులను కాలరాస్తున్నారని, పర్మినెంట్ గార్డులు ముగ్గురితో కలిసి మహిళా గార్డులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. వారికి లొంగని మహిళా గార్డుని డ్యూటీ నుండి తొలగిస్తున్నారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని డిప్యుటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో
శుక్రవారం జరిగిన జాయింట్ మీటింగ్‌లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న సూపరింటెండెంట్, జీఎం (హెచ్ఆర్) దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాస్, సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్, నగర నాయకులు జి.కిరణ్, నిమ్స్ సెక్యురిటీ యూనియన్ జనరల్ సెక్రెటరీ శ్రీహరి, శశికళ, ఎ.ఎం.రెడ్డి, కె.లక్ష్మి, అనురాధ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.