Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశవ్యాప్తంగా కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం అసంఖ్యాక విజయవంతమైన పోరాటాలు నిర్వహించిన ఘనత ఒక ఏఐటీయూసీకే దక్కుతుందని ీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ అన్నారు. ఏఐటీయూసీ 103వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సోమవారం హిమాయత్‌నగర్‌లోని రాష్ట్ర కార్యాలయం, సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 103 ఏండ్ల కింద స్థాపించబడిన ఏఐటీయూసీ అప్పటి నుంచి నేటి వరకు భారతీయ కార్మిక వర్గానికి అనేక కార్మిక వర్గ ఉద్యమాలకు ఏకైక వేదిక అయ్యిందని, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏఐటీయూసీ ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నేడు ప్రధాని మోడీ కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాశారని ఆరోపించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో కార్మిక వర్గ వ్యతిరేక చర్యలను చేపడుతుందని ఆగ్రహంవ్యక్తంచేశారు. మోడీ ప్రభుత్వం చేసిన విపత్తు భారతీయ శ్రామిక వర్గాన్ని నాశనం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ, కార్మికవర్గ వ్యతిరేక విధానాలన్నింటిపై రాజీలేని ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు, తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ పి.ప్రేమ్ పావని, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు ఎం.నరసింహ, బి.వెంకటేశం, మారగోని ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కమతం యాదగిరి, నగర నేతలు ఆర్.మల్లేష్, జ్యోతి, రమేష్, ఒమర్ ఖాన్, బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.