Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలు సరిదిద్దాలి: అభ్యర్థుల ర్యాలీ
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఇటీవల ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యానగర్, బీసీ భవన్‌కు భారీ ర్యాలీ జరిపారు. వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున వచ్చిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్స్ రాత పరీక్ష ఫలితాల్లో చాలా అవకతవకలు జరిగాయని నిపుణులు తేల్చారని, వీటిని సరిదిద్దాలని కోరారు. ఇప్పటికే 12 మంది అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. న్యాయం కోసం పోరాడి విజయం సాధించాలని ఏ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడరాదని పిలుపునిచ్చారు. న్యాయం జరిగే వరకు నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు. తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు 22 మార్కులు ఇవ్వాలన్నారు. మార్కులపరంగా క్వాలిఫై అయినప్పటికీ రిజల్ట్‌లో నెంబర్ లేని వారందరికీ ఓఎంఆర్ రివాల్యుయేషన్ చేయించాలన్నారు. మల్టీపుల్ ఆన్సర్స్ ఉన్న ప్రశ్నలన్నింటినీ తొలగించి మార్కులు కలపాలని సూచించారు. ఈర్యాలీలో గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, ఉదరు, జయంతి, నరసింహ గౌడ్, చంటి ముదిరాజ్, తిరుపతి, మల్లేశ్, భాస్కర్, తిరుమలగిరి అశోక్, హేమంత్, మంజుల, రమ తదితరులు పాల్గొన్నారు.