Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్ సింగ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా సంభవిస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్ సింగ్ తెలిపారు. ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత బ్రెయిన్ స్క్రీనింగ్ ప్యాకేజీతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యజమాన్యం 7 వేల రూపాయల బ్రెయిన్ స్క్రీనింగ్ ప్యాకేజీలో సీటీ స్కాన్-బ్రెయిన్ (స్క్రీనింగ్ మాత్రమే) న్యూరోలాజిస్ట్ కన్సల్టేషన్ అందిస్తామని చెప్పారు. ఇది నవంబర్ 10 వరకు మాత్రమే ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికవర్ బేగంపేట ఆస్పత్రి యజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ దయాల్‌సింగ్ రోజురోజుకు బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తపరిచారు. వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటు
వెంటనే చికిత్స అందించడం ముఖ్యమనీ, దానినే గోల్డెన్ హావార్స్ (గంటలు) అంటారని తెలిపారు. దీని ద్వారా యుక్త వయసు వారికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు. స్ట్రోక్ వల్ల సమాజం ఎంతగా నష్టపోతుందో వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ కొన్ని లెక్కల్లో తేలిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.70 కోట్ల మంది స్ట్రోక్ బారిన పడుతున్నారని, ప్రతి నలుగురి వ్యక్తుల్లో ఒక్కరైనా వారి జీవిత కాలంలో స్ట్రోక్‌కు గురౌతున్నారని, దీని కారణంగా ప్రతి 6 సెకన్లకు ఒకరు చనిపోతున్నారని వివరించారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతీ క్షణం విలువైనదే ఒక్క క్షణం ఆలస్యం చేసినా పరిస్థితి విషమించవచ్చునని చెప్పారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయి దాటిపోవచ్చునని తెలిపారు.
మారుతున్న జీవనశైలి
చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ రణధీర్ మాట్లాడుతూ స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు, కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడొచ్చని అన్నారు. మారుతున్న జీవనశైలిలో భాగంగా స్ట్రోక్స్ అనేవి పెరుగుతున్నాయని, దానికి కారణం ప్రస్తుత ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అతిగా మద్యం, పొగ తీసుకోవడం, సరైన సమయంలో ఆహారం నిద్ర పోకపోవడం అని చెప్పారు.
ఒకప్పుడు 50 ఏండ్లు దాటితేనే ఇటువంటి సమస్య వచ్చేది కానీ ఇప్పుడు 30 ఏండ్లకే స్ట్రోక్స్ బారిన పడుతున్నారని తెలిపారు. 80 శాతం మందికి క్లాట్స్ కారణాలు ముప్పును ముందుగానే తెలుసుకోకపోవడం, అవగాహన లేకపోవడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆస్పత్రిలో వెళ్లి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించుకోకపోవడం నిర్లక్ష్యం వహించడమే అన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి ఉన్నవారు ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నవారు వాటిని నియంత్రించుకోవాలని హెచ్చరించారు. కన్సల్టెంట్ న్యూరోఫిజీషియన్ డాక్టర్ మహమ్మద్ గౌషుద్దీన్ మాట్లాడుతూ ఫాస్ట్‌గా (ఫేస్ ఆర్మ్, స్పీచ్ టైం) ఉండండి, స్ట్రోక్ వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ప్రజలంతా ఫాస్ట్‌గా ఉంటే సరిపోతుందనీ చెప్పారు. కార్యక్రమంలో సెంటర్ హెడ్ డాక్టర్ హృషీకేశ్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.