Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముదిరాజ్ కులాన్ని బీసీ-ఏ గ్రూప్‌లో చేరిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారితుందని బీసీ-ఏ రిజర్వేషన్ పరిరక్షణ సమితి హెచ్చరించింది. సోమవారం సమితి వ్యవస్థాపకులు ఏఎల్.మల్లయ్య గంగపుత్ర, ప్రొ.ఎం.భాగయ్య నాయీ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ చైర్మెన్ వకులాభారణం కష్ణ మోహన్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, సీహెచ్ ఉపేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మల్లయ్య, ప్రొ.ఎం.భాగయ్య మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, ఆర్థిక సామాజిక, రాజకీయ ఇలా అన్ని రంగాల్లో అత్యంత వెనకబడిన కులాలు, భిక్షాటన చేసుకుని జీవనం సాగిస్తున్న కులాలు ఉన్న బీసీ ఏ గ్రూప్‌లోకి అత్యధిక జనాభా కలిగిన బీసీ డిలో ఉన్న ముదిరాజ్ కులాన్ని కలపడం అన్యాయం, రాజ్యాంగం కల్పించిన హక్కులని కాలరాయడమే అన్నారు. బీసీ డీలో ఉన్న ముదిరాజ్ కులాన్ని బీసీ ఏ లోకి ఎట్టిపరిస్థితుల్లో కలపవద్దు విజ్ఞప్తిచేశారు. ఒక వేళ ముదిరాజ్ కులాన్ని బీసీ ఏలో కలిపే విధమైన ఆలోచనలు చేస్తే, పెద్దఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకవేళ దురుద్దేశంతో కుట్రపూరితంగా పేరు చేర్చే ప్రయత్నం చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలతో గర్జనలు నిర్వహిస్తామని చెప్పారు. ఓయూ జేఏసీ అధ్యక్షులు డా.ఎల్చల దత్తాత్రేయ త్వరలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని బీసీ ఏ కులాల ఆధ్వర్యంలో భారీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో గోపి రజక, మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర, అబ్బులింగం, కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర, దశరథ్, శేఖర్ వడ్డెర, పల్లికొండ నర్సయ్య గంగపుత్ర, గోపి బోయ, లక్ష్మణ్ రావ్ బుడబుక్కల, ఎంబీసీ నరహరి, నగేష్ బొప్పల, యుగంధర్ మేరు, పూస శ్రీనివాస్, డా.సంగెం శ్రీను, మానస గణేష్ చిత్తరాంజన్ తదితరులు పాల్గొన్నారు.