Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్సాహంగా రాహుల్ భారత్ జోడో యాత్ర
- తొలిరోజు నగరంలో 18 కి.మీపైనే సాగిన యాత్ర
- చార్మినార్ వద్ద జాతీయ పతాకావిష్కరణ
- అడుగడుగునా ప్రజలు, యువత, కార్యకర్తలు
- రాహుల్ గాంధీకి నీరాజనం
నవతెలంగాణ-సిటీబ్యూరో/ధూల్‌పేట్/ బంజారాహిల్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నగరంలో అట్టహాసంగా సాగింది. నగర ప్రజలు, యువత, పెద్దలు, పిల్లలు ఆయనను కలిసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. తొలిరోజు అరాంఘర్ నుంచి చార్మినార్, అక్కడి నుంచి నెక్లెస్ రోడ్ వరకు 18కి.మీ పాదయాత్ర రాహుల్ కొనసాగించారు. ముఖ్యంగా రాహుల్‌ను చూసేందుకు యువత పోటిపడ్డారు. రాహుల్ కాబోయే పీఎం, పీఎం అంటూ నినదించారు. దీనికితోడు దారిపొడవున రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారత్ జోడో యాత్రతో నగరమంతటా సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం కాంగ్రెస్ జోడో యాత్రలో భాగంగా అరాంఘర్ మీదుగా ఉదయం పది గంటలకు తాడ్‌బన్‌కు చేరుకుంది. అక్కడ ఆయన లెగసీ ప్యాలెస్‌లో విరామం తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకు బహదూర్‌పూరా మీదుగా పురానాపూల్ దర్వాజాకు చేరుకున్నారు. పురానాపూల్ చౌరాస్తా నుంచి మండలి అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, బోనాలు, పోతరాజుల విన్యాసాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అక్కడ నుంచి యాత్ర ప్రారంభించి మూసాబౌలి, ముర్గీషాక్ల మీదుగా చారిత్రాత్మక చార్మినార్‌కు చేరుకున్నారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సదాÄ్భవనా సమితి ప్రతినిధి నిరంజన్ ఆధ్వర్యంలో సదాÄ్భవన స్థూపం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. మొదట వందేమాతర గీతం ఆలాపించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ధ్వజ్ గీతను ఆలపించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేదికపై జోడో యాత్ర చైర్మెన్ దిగ్విజరు సింగ్, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్, జయరాం రమేష్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్‌లతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కన్నయ్యలాల్ రాహుల్ గాంధీకి కండువాలు కప్పారు. అనంతరం ర్యాలీ గుల్జార్ హౌస్, మదీనా అఫ్జల్ గంజ్ మీదుగా గాంధీభవన్‌కు చేరుకుంది. అక్కడ రాహుల్ గాంధీ ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి అడుగులు వేస్తూ.. వారితో ముచ్చటించారు. మెట్రో నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల ఓ టిఫిన్ సెంటర్లో ఆగి టీ తాగారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ప్రకారం నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ హాజరై మాట్లాడారు.
జనసంద్రంగా జోడో యాత్ర
భారత్ జోడో యాత్ర 54 రోజు తెలంగాణలో 7వ రోజుగా హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్‌కు చేరుకుంది. ఇక్కడి కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటలకే శంషాబాద్ నుంచి ప్రారంభమైన యాత్ర చార్మినార్, గాంధీభవన్, నాంపల్లి, అసెంబ్లీ మీదుగా నెక్లెస్ రోడ్‌కు చేరుకుంది. దారి పొడవునా స్వాగత తోరణాలు, భారీగా జన సందోహం నడుమ రాహుల్ పాదయాత్ర జనసంద్రంగా మారింది. ఎక్కడికక్కడ రాహుల్‌ని స్వాగతించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావటంతో కొన్ని ప్రాంతాల్లో భద్రత కూడా కష్టతరంగా మారింది. అయినా మొక్కవోని ధైర్యంతో రాహుల్ ఎక్కడికక్కడ అభిమానులు, కార్యకర్తలను చిరునవ్వుతో పలకరిస్తూ అభివాదం చేస్తూ కార్నర్ మీటింగ్‌కు చేరుకున్నారు. అనంతరం కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. దేశ సమైక్యత కోసం యాత్ర సాగుతుందని, మీ ప్రేమ, మీ ఆదరణతో నేను ముందుకు సాగుతున్నానని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి అన్నారు. గడిచిన 56 రోజులుగా సాగుతున్న భారత్ జోడో యాత్రలో అతిపెద్ద నగరం హైదరాబాద్ కావటంతో భారీగా ప్రజలు తరలివచ్చి రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. వందలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి రాహుల్‌కి నీరాజనం పలికారు. బహిరంగ సమావేశమనంతరం రాహుల్ గాంధీ ఆయన కాన్వరులో బోయిన్‌పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్‌కు చేరుకొని బస చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా కళారూపాలు
భారత్ జోడో యాత్రలో తెలంగాణ సంస్కృతి కళా రూపాలు, బోనాలు, శివభక్తులు, పోతరాజుల, సదర్, జానపద కళా విన్యాసాలు వంటివి ప్రదర్శించారు. పాదయాత్ర కొనసాగిన దారిలో అక్కడక్కడ ఒక కళా బృందాలను ఏర్పాటు చేసి ప్రదర్శన నిర్వహించారు. పాదయాత్రకు అడుగడుగునా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
పోలీసుల భారీ బందోబస్తు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్‌లో కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆయన పాదయాత్ర కొనసాగింది. 'భారత్ జోడో'యాత్ర సందర్భంగా మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాలల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆరాంఘర్, పురానాపూల్ జంక్షన్, ముసబౌలి, లాడ్‌బజార్, చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, గాందీభవన్, నాంపల్లి, ఆర్బీఐ రోడ్డు మీదుగా ఐమాక్స్ రోటరీ వరకు యాత్ర సాగింది. నెక్లెస్‌రోడ్డులో బహిరంగ సభను పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ తదితర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. బస్సులు, కార్లు, డీసీఎంలతోపాటు ద్విచక్రవాహనలపై వేలాది మంది తరలి వచ్చారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసుల సూచనలతో కొందరు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లారు. రాహుల్ పాదయాత్ర ప్రశాతంగా కొనసాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికుల ఇబ్బందులు
భారత్ జోడో యాత్ర సందర్భంగా బెంగుళూరు హైవే ప్రధాన రహదారి వాహనాలపై రాకపోకలను నిలిపివేశారు. దీంతో అఫ్జల్‌గంజ్, పేట్ల బుర్జ్, సిటీ కళాశాల, పురానాపూర్, బహదూర్‌పురా, థర్డ్ వన్ మీదుగా జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం మూడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్టాప్‌ల వద్ద ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు వాహనాల కోసం ఎదురు చూశారు. సాయంకాలం కావడంతో వివిధ ఉద్యోగ వ్యాపార నిమిత్తం వెళ్లినటువంటి ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
రాహుల్‌ని కలిసి రోహిత్ వేముల తల్లి
సెంట్రల్ యూనివర్సిటీలో మతతత్వ శక్తులకు బలియైన పీహెచ్డీ స్టూడెంట్ రోహిత్ వేముల తల్లి, తమ్ముడు మంగళవారం నగరంలో జరిగిన రాహుల్ జోడో యాత్రలో ఆయనను కలుసుకున్నారు. రాహుల్‌తో కలిసి అడుగులో అడుగు వేశారు. అప్యాయంగా వారిని రాహుల్ పలకరించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. గాంధీభవన్ వద్ద ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులతో మాట్లాడారు. వారితో నడుస్తూ.. వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. మరికొద్ది దూరంలో ఓ హోటల్లోకి వెళ్లి చారు తాగారు. కొంతమంది విద్యార్థులు రాహుల్ ముందు జిమ్నాస్టిక్ చేసి చూపించారు. ఇలా దారిపొడవునా ఎదురుగా వచ్చే వారికి అభివాదం చేస్తూ.. ఆయన వద్దకు వచ్చేవారి సమస్యలు వింటూ ఓదార్చుతూ... ముందుకు సాగుతూ..జోడో యాత్రను ఉత్సాహంగా కొనసాగించారు.