Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య
- విద్యార్థులతో కలిసి సంక్షేమ భవన్ ముట్టడి
నవతెలంగాణ-మెహదీపట్నం
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్, జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. గ్రేటర్ పరిధిలోని వివిధ కాలేజీల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఈముట్టడిలో పాల్గొన్నారు. ప్రభుత్వ భవనాలు, సచివాలయాలు, కలెక్టరేట్లు కట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి డబ్బులు ఉండవా అంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు ఐదేండ్ల కిందట నిర్ణయించారని, అవి విద్యార్థులకు ఏమాత్రం సరిపోవటం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రస్తుతం రూ.20వేలు స్కాలర్‌షిప్‌గా ఇస్తున్నారని, కానీ తెలంగాణలో మాత్రం రూ.5వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుత అవసరాలు తగ్గట్టు రూ. 20వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ కష్ణ, చంటి ముదిరాజ్, నరసింహ గౌడ్, అనంతయ్య, రాజ్ కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.