Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాతబస్తీలోని సాలార్ జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ఐయూజే) నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమం కోసం కృషి చేస్తూ ఇతర జిల్లాల నేతలకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. పదవులు ముఖ్యం కాదని, తోటి జర్నలిస్టులకు మేలు చేసే కార్యక్రమాలే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి నాయకత్వాన్ని వహించిందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ చరిత్రలో హెచ్యూజేకు ఉన్న పేరు, ప్రతిష్ఠలు కాపాడే దిశలో నూతన కార్యవర్గం కార్యక్రమాలు రూపొందించుకోవాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ సూచించారు. హెచ్‌యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, కార్యదర్శి అబ్దుల్ హమీద్ షౌకత్‌తో పాటు నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎంఏ. మజీద్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణు దాస్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్ వరకాల యాదగిరి, హాబీబ్ జిలానీ, బి. కిరణ్ కుమార్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అస్టర్ అవార్డు..
యూనియన్ సీనియర్ నాయకుడు, సుప్రసిద్ధ ఉర్దూ పాత్రికేయుడు ఫయాజ్మహమ్మద్ అస్టర్ స్మారక అవార్డును ఐజేయూ నేత ఎం.ఏ. మజీద్‌కు పాతబస్తీ జర్నలిస్టుల సంఘం అందించి ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో పాతనగర జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె. రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దం అమరేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. భరతాచారి, కోశాధికారి కె. శ్రవణ్ కుమార్, సలహాదారులు వి. వెంకటాచారి, జర్నలిస్టులు ఇబ్రహీం, ముత్యాల శ్రీనివాస్, ఐలేష్, సాయి, రాజ్, మజీద్ తదితరులు పాల్గొన్నారు.