Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలుడి విజ్ఞప్తికి స్పందించిన మంత్రి కేటీఆర్
- కాలనీలో వాటర్ బోర్డు ఎండీ పర్యటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
బాలల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఓ బాలుడు తమ కాలనీకి నల్లా నీరు సరఫరా కోసం విజ్ఞప్తి చేశాడు. తాము రాజేంద్రనగర్ గోల్డెన్ సిటీ కాలనీలోని పిల్లర్ నెంబర్ 248 సమీపంలో నివసిస్తున్నామనీ, తమకు నల్లా నీళ్లు సరఫరా లేక ఇబ్బంది పడుతున్నామని ఉమర్ అనే బాలుడు తమ సమస్యను ఒక ప్లకార్డు పట్టుకుని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చాడు. బాలల దినోత్సవం సందర్భంగా తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఈ వీడియోను ఒక నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. బాలుడు ఉమర్ వినతికి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. బాలుడు నివసించే కాలనీకి ప్రత్యక్షంగా వెళ్లి సమస్యను పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిశోర్‌కు సూచించారు. దీంతో దానకిశోర్ వెంటనే గోల్డెన్ సిటీ కాలనీలో పర్యటించారు. బాలుడు ఉమర్‌తో పాటు కాలనీవాసులను కలిసి మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. జీహచ్ఎంసీ నిషేదాజ్ఞలతో పైప్‌లైన్ ఏర్పాటు పనులు ఆలస్యమయ్యాయని ఎండీ వివరించారు. రెండు వారాల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసి నల్లా ద్వారా తాగునీరు చేస్తామని హామీనిచ్చారు. అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా కాలనీకి నీటి సరఫరా కొనసాగిస్తామని తెలిపారు. బాలుడు ఉమర్ తమ కాలనీ నీటి సమస్యను వెల్లడించిన నాలుగు గంటల్లోపే మంత్రి కేటీఆర్ స్పందించడం, జలమండలి ఎండీ దానకిశోర్ నేరుగా గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో జలమండలి ఎండీ దానకిశోర్‌ను మంత్రి కేటీఆర్ అభినందిస్తూ మరో ట్వీట్ చేశారు.