Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు. సోమవారం ఆఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర లైబ్రరీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు రావాల్సిన పుస్తకాలు కాగితంపై రాసి ఇస్తే చాలు.. వాటిని సమకూర్చేందుకు అన్ని గ్రంథాలయాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఔటర్ రింగురోడ్డు పరిధిలోని నగరం నలుమూలలా గ్రంథాలయాను అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, నియోజకవర్గాల స్థాయిలో పాఠకుల అభిరుచికి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 5వేల పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో పరనాసక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఏదైనా శుభకార్యాలు, పండుగల సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు బొకే లకు బదులు ప్రత్యామ్నాయంగా పుస్తకాలు, రాతపుస్తకాలు తేవాలని సూచిస్తుంటానని గుర్తు చేశారు. తన విజ్ఞప్తి మేరకు ఇప్పటి వరకూ సుమారు 1.5 లక్షల డిక్షనరీలు, పుస్తకాలు వచ్చాయనీ, వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బహూకరిస్తున్నట్లు తెలియజేశారు. పాఠకుల సమస్యల పరిష్కారంతో పాటు ఉద్యోగులు పింఛనుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ అయాచితం శ్రీధర్, డైరెక్టర్ శ్రీనివాసచారి, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మెన్ రావుల శ్రీధర్ రెడ్డి, నగర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ప్రసన్న రామ్మూరి, ఇన్చార్జి ముఖ్య గ్రంథపాలకులు రాణి, కేసరి హనుమాన్, రవి, రాకేష్, ధర్మేందర్, మహేష్, శ్రీకాంత్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ధూల్‌పేట్: గ్రంథాలయాలు నైతిక విలువలను అలవరుస్తాయని సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి బాల భాస్కర్ అన్నారు. సిటీకాలేజీ లైబ్రరీలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా సోమవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి బాల భాస్కర్ హాజరై మాట్లాడుతూ గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని, నైతిక విలువలు అలవర్చుకోవాలన్నారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా మెలగాలన్నారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తక సంపదను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. డాక్టర్ రవికుమార్ చేగోని వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు కోయి కోటేశ్వరావు, నీరజ, పర్వతాలు, మల్లికార్జున్, తిరుపతి, రమాదేవి తదితర ఉపాధ్యాయ సిబ్బంది, తబుసం ఫాతిమా, బాలేష్. గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓయూ: చిక్కడపల్లి గ్రంథాలయంలో నిర్వహించిన వారోత్సవాల్లో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ చేసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మెన్ ప్రసన్న, స్టేట్ గ్రంథాలయ చైర్మెన్ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.