Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్‌లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎస్పీఆర్ హిల్స్‌లో చుట్టూ కొండల మధ్యన 5 ఎకరాల క్వారీ ల్యాండ్‌ను పూర్తిగా పూడ్చి వేసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందరికీ ఉపయోగపడునట్లు యువకుల కోసం క్రికెట్ మైదానంగా తయారు చేయించారు. అయితే మైదానానికి ఒకవైపు శివాలయం, మరోవైపు ముస్లింల ఖిల్లా ఉంది. ఖాళీగా ఉన్న కొండపై క్రైస్తవులు కూడా పండగ జరుపుకోవాలని ఉద్దేశంతో డివిజన్లోని టీఆర్ఎస్ నాయకులు, క్రైస్తవులతో కలిసి ఆ ప్రదేశంలో సిలువా, స్టార్ గుర్తుని ఏర్పాటు చేయాలని అక్కడకు చేరుకున్నారు. అయితే బీజేపీ నాయకులు, కార్యకర్తలు శివాలయానికి దగ్గరలో క్రైస్తవుల గుర్తులు ఎలా పెడతారు అని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కలిసి వచ్చి అక్కడ ఎలాంటి గొడవ జరగకుండా అడ్డుకున్నారు. అకారణంగా గొడవకు దిగిన బీజేపీ కార్యకర్తలను కొంతమందిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు.