Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీ స్వలాభం కోసం డివిజన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తావా
- అవినీతి చిట్టాతో త్వరలోనే ఫిర్యాదు చేస్తాం
- బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజల ఓట్లతో ప్రజాప్రతినిధిగా ఎన్నికై నేడు అ ప్రజలనే ముప్పు తిప్పలు పెడుతున్న నువ్వు ప్రజాప్రతినిధివా ... లేక కమీషన్ ఏజెంట్‌వా? అంటు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డివిజన్ కార్పొరేటర్‌పై మండి పడ్డారు బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్. ఈ మేరకు గురువారం నాడు మొదటి డివిజన్ పరిధిలోని క్రాంతినగర్ కాలనీలో పర్యటించిన ఆయన ప్రజల నుండి సమస్యలు విని వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికైన మొదటి డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ కమీషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని వాపోయారు. డ్రెయినేజీ పైప్ లైన్ పేరిట ఇంటికి రూ.10,20 చొప్పున వసూళ్లు చేశాడని అన్నారు. కాలనీలో ఇంటి నిర్మాణం కోసం కార్పొరేషన్ అనుమతులు పొందినా కూడా స్థానిక కార్పొరేటర్ ట్యాక్స్ కట్టాల్సిందేనని, లేకపోతే ఇంటి నిర్మాణానికి అనేక ఆటంకాలు సృష్టించి ప్రజల నుండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని అన్నారు. ఎన్నుకున్న ప్రజలకు సేవా చేయాల్సిన కార్పొరేటరే ఇలా ఇష్టాను సారంగా వ్యవహరిస్తూ తన మనుషులతో వసూళ్లకు పాల్పడే అధికారం ఎవరిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. డివిజన్లో మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, భూగర్భ డ్రెయినేజి లాంటి సదుపాయాలపై దృష్టి సారించకుండా కేవలం కలెక్షన్లే ప్రధాన అజెండాగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. నగర ప్రణాళిక అధికారులతో కలిసి డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్లో కార్పొరేటర్ సహకారంతో అనేక అనుమతులు లేని నిర్మాణాలను చేపట్టిన కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. క్రాంతినగర్ కాలనీ రోడ్డు నెంబరు 4, వీధి నెంబరు 3లో కాలనీవాసులను ఇబ్బందు లకు గురిచేసేందుకు బలవంతంగా పెద్ద పైప్‌లైన్ వేయాలని బలవంతంగా పనులు చేయడం సరికాదని అన్నారు. కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఆగడాలపై త్వరలోనే ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్‌కు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్ర మంలో కాలనీవాసులు ఈశ్వర్చారీ, చంద్రశేఖర్, మధు, నవీన్, మధు, మనోజ్, భరత్, రామ్మూర్తి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.