Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
- ఈడబ్ల్యూఎస్ కాలనీ, గౌస్ నగర్లో పాదయాత్ర
నవతెలంగాణ-ధూల్‌పేట్
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు వెంటనే కేటాయించాలనీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్టలోని ఈడబ్ల్యూఎస్ కాలనీ, గౌస్‌నగర్‌లో డబుల్ బెడ్రూం, స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డున ఉన్న గౌస్ నగర్, ఈడబ్ల్యూఎస్ కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేదల సమస్యలను ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలనీలో చాలా మంది అద్దె ఇండ్లల్లో ఉంటూ అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని సర్వేలు చేస్తూ ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడంతో అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారన్నారు. పైగా ఇండ్లు ఉన్నవారికి మళ్లీ ఇండ్లను కేటాయించడం దారుణం అన్నారు. దాని వల్ల నిజమైన లబ్దిదారులకు నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కచ్చితంగా అక్కడ నివసిస్తున్న పేదలను గుర్తించి 'డబుల్' ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదలతో కలిసి ఇండ్లలోకి ప్రవేశం చేస్తామని హెచ్చరించారు. గౌస్ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో స్థానికులకు మొదట ప్రాధాన్యత కల్పించాలన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు విఠల్ మాట్లాడుతూ.. స్థానిక సమస్యలను పరిష్కరించి, కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈనెల 28న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, కోటయ్య, మీనా, జిల్లా కమిటీ సభ్యులు లక్మమ్మ, సత్తార్ ,బాబార్ ఖాన్, జంగయ్య, లతీఫ్, బాలు, కృష్ణ, కిషన్, స్వామి, జీవన్, ఫర్జాన, అష్మా, టిప్పు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.