Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రామిక మహిళా ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ పి.ప్రేమ్ పావని
- మహిళా సమాఖ్య హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మహిళలు, బాలికలపై వివక్ష, హింస మానవ హక్కుల ఉల్లంఘనే అని తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ పి.ప్రేమ్ పావని తెలిపారు. మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా 'మహిళలపై అన్ని రకాల వివక్ష, హింస నిర్మూలించాలని' డిమాండ్ చేస్తూ శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద మహిళా సమాఖ్య హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పి.ప్రేమ్ పావని మాట్లాడుతూ మహిళలు, బాలికలపై హింస అనేది భౌగోళికం, సంస్కతి సరిహద్దులు తెలియని ప్రపంచ సంక్షోభం అని, అట్టడుగు స్త్రీలు, బాలికలు దీనిని ఎక్కువగా అనుభవిస్తారన్నారు. మహిళల రక్షణకు దాదాపు 155 దేశాల్లో పటిష్టమైన చట్టాలు ఉన్న ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మహిళలు, బాలికలపై గహ హింస, లైంగిక వేధింపులు, బలవంతపు వివాహలు, లైంగిక అక్రమ రవాణాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం, పురుషులు, స్త్రీల మధ్య అధికారాలు, వనరుల పంపిణీ కోసం బలమైన పోరాటాలు నిర్మిస్తే స్త్రీలకు హక్కులు, ఆర్థిక స్వాతంత్రం, భద్రత, రక్షణ లభిస్తాయని, హింస నిర్మూలించబడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అనంతరం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు చట్టపరమైన, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం లభించనందుకు మహిళలు అసమానతలకు, హింసకు గురవుతున్నారన్నారు. మహిళలపై హింస నిర్మూలన సమస్యపై ప్రజలందరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఛాయాదేవి మాట్లాడుతూ మహిళలపై హింస అనేది మహిళల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను ఉల్లంఘిస్తుందని తెలిపారు. మహిళల హక్కులు, స్వేచ్ఛను రక్షించడంలో ప్రభుత్వాలు దీర్ఘకాలిక వైఫల్యం చెందుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నగర నాయకులు షహనా అంజుమ్, కె.రాధిక, కె.జ్యోతి శ్రీమాన్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
స్త్రీ, పురుష సమానత్వంపై ప్రచారోద్యమం
సమాజంలో మార్పు రావాలంటే ముందుగా అట్టడుగున ఉన్న దళిత, ఆదివాసీ మహిళలపై వివక్ష, హింస ఆగాలని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ అన్నారు. దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో శుక్రవారం హిమాయత్ నగర్, లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద స్త్రీ, పురుష సమానత్వంపై అవగాహన కల్పించడం కోసం ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో 'లీగల్ క్లినిక్'ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేడు ప్రవేశపెడుతున్న కేసుల్లో హత్యలు, లైంగికదాడులు, సామూహిక దాడులు, ప్రేమ పేరుతో మోసాలు, భూ కబ్జాలు, లైంగిక వేధింపులు వంటివి ఎక్కువయ్యాయని, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాజానికి సంబంధించిన శాఖలైన పోలీస్, న్యాయ వ్యవస్థలకు అర్థం చేయించడం, ప్రజలను చైతన్య పరచడమే ఈ లీగల్ క్లినిక్ ముఖ్య ఉద్దేశం అన్నారు. బాధిత మహిళలకు న్యాయం అందకపోవడం, బాధితుల పైన తప్పుడు సాక్షాలు పెట్టి భయబ్రాంతులకు గురి చేయడం, బాధితులను రాజీ పడేలాగా బలవంత పెట్టడం అత్యంత బాధాకరమన్నారు. రాజ్యాంగ హక్కుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ దోపిడీకి గురవుతున్నారని, చదువుకున్న ఆడపిల్లలే ఎక్కువ మోసాలకు గురవుతున్నారన్నారు. మహిళలు ఆత్మ గౌరవంతో బతకాలని సూచించారు. నేటి నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు 16 రోజుల పాటు స్త్రీ, పురుష సమానత్వంపై ప్రచారోద్యమం కొనసాగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు వైజయంతి, సజయ, సత్యవతి, భూమిక, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.