Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్
- ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలు డిసెంబరు 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ చెప్పారు. శుక్రవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ మాట్లాడుతూ రోజుకు మూడు దఫాలుగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 47 సబ్జెక్టులలో 9776 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు ఈసారి ఒక్క నిముషం నిబంధనను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. అభ్యర్థులు పరీక్షా సెంటర్‌కు గంట ముందుగానే చేరుకోవాలని, ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్నారు. అత్యధికంగా కామర్స్ ఫ్యాకల్టీలో 841 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా పర్షియన్ సబ్జెక్టులో నలుగురు పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను శనివారం నుంచి ఓయూ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎంట్రెన్స్ పేపర్ 70 మార్కులకు ఉంటుందని, 39 మార్కులు అకాడమిక్ క్రెడెన్షియల్స్ కేటాయించినట్లు వివరించారు. ఈ రెండింటిని కలిసి ర్యాంక్ తీసి, ఆ ర్యాంకు ఆధారంగా పీహెచ్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని ఆయనకోరారు.
దాడులకు పాల్పడితే సహించం
ఇటీవల యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై వీసీ రవీందర్ యాదవ్ స్పందిస్తూ విద్యార్థులకు అకడమిక్ పరంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి తాము సిద్దంగా ఉన్నామని, అయితే అనవసరమైన గొడవలు, వర్సిటీ అధికారులపై దాడులకు పాల్పడితే మాత్రం సహించేది లేదన్నారు. కొంత మంది విద్యార్థులు కావాలనే అనేక రకాలుగా వర్సిటీలో అవాంతరాలు సష్టిస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. అలాగే వర్సిటీ పీజీ కోర్సులలో క్రెడిట్స్‌పై మాట్లాడుతూ యూజీసీ నిబంధనల ప్రకారమే క్రెడిట్స్ నిర్ణయించామని, ఇప్పుడున్న 96 క్రెడిట్స్ 80కి కుదించినట్లు చెప్పారు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, చాలా రాష్ట్రాల్లో స్టేట్ యూనివర్సిటీలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. కాగా 2024లో నాక్ గుర్తింపుకు వర్సిటీ వెళ్లాల్సి ఉందని, అందుకే యూజీసీ నిబంధనల ప్రకారంగా క్రెడిట్స్ తెచ్చామని చెప్పారు. దీని వల్ల ఎవరికి పీరియడ్లు తగ్గవని, వర్కింగ్ అవర్‌ను ఇంకో విధంగా మెరుగు పర్చుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే దీనిపై అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు అపోహలు పోవద్దని వీసీ కోరారు. సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పప్పుల. లక్ష్మీనారాయణ, ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.ఐ. పాండురంగారెడ్డి పాల్గొన్నారు.