Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్
నవతెలంగాణ-అడిక్‌మెట్
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై బీజేపీ జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడటం హాస్యాస్పదం అని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్ అన్నారు. శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ జాబితా నుంచి 26 కులాలను తొలగించిన విషయం ఇప్పుడు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌కు గుర్తుకు రావడం, ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. తొలగించిన 26 ఉపకులాలను బీసీ జాబితాలో చేర్చాలని ఆర్ కష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం పోరాడుతూనే ఉన్నారన్న విషయం గుర్తించుకోవాలని సూచించారు. దేశ జనాభా గణనలలో బీసీ ఉపకులాల గణన చేపడతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదో చెప్పాలన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీసీ ఓట్లను కొల్లగొట్టి అధికారం వెలగబెడదామని నాటకీయత ప్రదర్శిస్తే నమ్మడానికి బీసీలు సిద్ధంగా లేరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయం ఎవరు మర్చిపోరు అన్న విషయం గుర్తించుకోవాలని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలని లక్ష్మణ్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, గొరిగే మల్లేష్ యాదవ్, బీసీ సేన రాష్ట్ర కార్యదర్శి జేవీ రావ్, బాలస్వామి, సెలేటి వెంకటేష్, మద్దూరు వెంకటేష్, గుడి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.