Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతదేహంతో బంధువుల నిరసన
- సంజయ్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
నవతెలంగాణ-ముషీరాబాద్
అత్తింటి వేధింపులతో ఓ గృహిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా పోచంపాడు మండలం అనంతకూడు గ్రామానికి చెందిన మల్లయ్య, సత్యమ్మల పెద్ద కూతురు శ్రీలతను బాగ్‌లింగంపల్లి సంజయ్‌నగర్‌లో నివాసముండే గడ్డం సాగర్‌కు 9 సంవత్సరాల కిందట ఇచ్చి పెండ్లి జరిపించారు. ఆ సమయంలో రూ.9 లక్షలు కట్నంగా అబ్బాయికి ఇచ్చారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెండ్లయిన నాటి నుంచి భార్యను భర్త, ఆమె అత్త, మరిది, ఆడపడుచు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిసింది. అయిదు నెలల కిందట శ్రీలత పుట్టింటికి వెళ్లింది. ఈనేపథ్యంలో పాఠశాలలో చదువుకునే పిల్లలను చూడటానికి ఇటీవల భర్త ఇంటికి వచ్చిన శ్రీలతను అత్తింటి వారు అడ్డుకున్నారు. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. దాంతో శ్రీలతా తీవ్ర మనస్తాపం చెంది స్వగ్రామంలో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీలత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సంజయ్‌నగర్‌లో ఉన్న అత్తింటి వారి ఇంటి వద్దకు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బైటాయించారు. దీంతో సంజయ్ నగర్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసీపీ యాదగిరి, సీఐ సంజయ్‌కుమార్, భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.