Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలంటూ విద్యార్థులు గురువారం ఓయూ పరిపాలనా భవనం ఎదుట పెద్దఎత్తున ధర్నా, ఆందోళన చేపట్టారు. క్రెడిట్స్ మినహాయింపును 75 నుంచి 25కి తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఓయూ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రతీ గ్రూప్, బ్యాచ్‌లోనూ సాధారణంగా ఏటా 4-5 విద్యార్థులు ఫెయిల్ అవుతారని గుర్తు చేశారు. కానీ ఈ ఏడాది 4-5 మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారని చెప్పారు. అన్ని కళాశాలలు కలిపి దాదాపు అయిదు వేల మంది విద్యార్థులు డిటెయిన్డ్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ విద్యార్థులకు 25 క్రెడిట్స్ మినహాయింపునిచ్చారని, అదే ఓయూలో 75 క్రెడిట్స్ మినహాయింపు ఉందని చెప్పారు. జేఎన్టీయూ విద్యార్థులకు ఒక న్యాయం తమకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పరీక్షకు హాజరైనప్పటికీ కొంతమందికి ఫలితాల్లో గైర్హాజరైనట్లు పేర్కొన్నారని, ఇదేం న్యాయం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రవి నాయక్, శ్రీను, ఆంజనేయులు ఆధ్వర్యంలో ఓఎస్డీ, స్టూడెంట్స్ డీన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.