Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ మహాసభలో పైళ్ల ఆశయ్య డిమాండ్
నవతెలంగాణ-ముషీరాబాద్
రజక వృత్తిదారులకు సబ్సిడీతో కూడిన రుణాలను వెంటనే అందజేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నగర అధ్యక్షులు సి.వెంకటస్వామి అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్లో నగర 4వ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది రజక వృత్తిదారులు ఉన్నారని, 75 ఏండ్ల స్వతంత్ర కాలంలో రజకులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగంలో తీవ్రంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రజక ఫెడరేషన్ ద్వారా ప్రతి వృత్తిదారుడికి రెండు లక్షల రుణం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని డివిజన్లలో మోడ్రన్ దోబీ ఘాటు నిర్మించాలని, ఉచిత విద్యుత్ పథకాన్ని ఎల్టీ 4లో చేర్చి అదనపు చార్జీలు పడకుండా చూడాలని కోరారు. వేలాదిమంది రజకులు అపార్ట్మెంట్ వాచ్మెన్గా, లాండ్రి షాపులు ఏర్పాటు చేసుకొని జీవితాలు వెలదీస్తున్నారన్నారు. ప్రభుత్వం వీళ్లందరికీ డబుల్ బెడ్ రూమ్ అందించాలని, 50 ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు, రక్షణ చట్టం చేయాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ రజకవృత్తిదారుల సంఘం నగర కార్యదర్శి జి నరేష్ మాట్లాడుతూ రజకులు గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి కోల్పోయి పట్టణాలకు వలస పోతున్నారని వారందరికీ ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. నగరంలో ఉన్న దోబీఘాట్ అన్నిటినీ మోడ్రన్ చేయాలని 9 తీర్మానాలని ప్రవేశపెట్టారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి ఉపేందర్, కమిటీ సభ్యులు ఎం.గోపాల్, యాదమ్మ, నాగేష్, సోషల్ మీడియా నగర కన్వీనర్ రాపర్తి ప్రభాకర్, ఎం. రమేష్, లోంకా సోమయ్య, కె స్వామి, జి బిక్షపతి, కె.యాదగిరి, లక్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.