Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనార్టీ హక్కుల దినోత్సవంలో వక్తలు
నవతెలంగాణ-ధూల్‌పేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అడ్వకేట్లు మౌలానా అబ్దుల్ ఖుదుస్ గౌరీ, మహమ్మద్ అఫ్జల్, డాక్టర్ ఇగ్బాల్ జావీద్ అన్నారు. ఆదివారం ఆలం ఖున్ద్ మీరిభవన్లో ఆవాజ్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలను చాలా చిన్న చూపు చూస్తూ, తమ హక్కులను కాలరాస్తున్నాయన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితమై ఓటు బ్యాంకుగా ఉపయోగిస్తున్నారన్నారు. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలను సృష్టిస్తూ మైనార్టీల్ని భయాందోళనకు గురి చేస్తు అనేక అల్లర్లు సృష్టించింది తప్ప, చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చడం లేదన్నారు. పైగా మైనార్టీలపై దాడులు చేస్తూ రాజ్యాంగాన్ని కూడా లెక్కచేయడం లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ముస్లిం మైనార్టీలకు హక్కులు కల్పించడం లేదని, కనీసం తాగునీరు, పరిశుభ్రత చిన్న పాటి వసతులు కూడా నోచుకోవడం లేదన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందించకుండా కేవలం దిష్టిబొమ్మలాగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల విద్యా వైద్యాభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ఆఖరికి మైనార్టీ విద్యార్థులను ఇవ్వాల్సిన స్కాలర్షిప్లని కూడా రద్దు చేస్తూ మత రాజకీయాలు సృష్టించి భయాందోళనకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తూ, మైనార్టీల గొంతు నొక్కుతున్నాయనీ దీన్ని ఆవాజ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. భవిష్యత్తులో మైనారిటీల హక్కుల కల్పించకపోతే పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆవాజ్ నగర అధ్యక్షులు అబ్దుల్లాతీఫ్, ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖలీముద్దీన్, గులాం నసీర్, నూర్జహాన్, సయ్యద్ ఇబ్రహీం, అబ్దుల్ ఖాదర్, సయ్యద్ అలీమ్, అబ్దుల్ జబ్బర్, టీయూ నాయకులు బాబరాన్ తదితరులు పాల్గొన్నారు.